Airconditioners: ఆ వార్తలన్నీ పుకార్లే.. ఫ్రీ ఏసీల స్కీమ్‌పై కేంద్రం స్పష్టత

ఇటీవల కాలంలో ఫేక్ వార్తలు ఎక్కువయ్యాయి. ఓ తెలుగు సినిమాలో చెప్పినట్లు నిజం గడపదేటే లోపు అబద్ధం పది ఊళ్లను చుట్టేస్తుందనే చందాన ఫేక్ వార్తల వ్యాప్తి బాగా ఎక్కువైంది. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏసీ యోజన స్కీమ్ కింద ఫ్రీగా ఏసీలు ఇస్తున్నారనే వార్త హల్‌చల్ చేసింది. అయితే ఇది ఫేక్ వార్త అని పీఐబీ స్పష్టం చేసింది.

Airconditioners: ఆ వార్తలన్నీ పుకార్లే.. ఫ్రీ ఏసీల స్కీమ్‌పై కేంద్రం స్పష్టత
Pm Modi Ac

Updated on: Apr 22, 2025 | 7:47 PM

ప్రజలకు ఉచిత ఎయిర్ కండిషనర్లు (ఏసీలు)ను అందిస్తామని హామీ ఇస్తూ ప్రభుత్వం ‘పీఎం మోదీ ఏసీ యోజన 2025’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ పథకం కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారని, నమోదు చేసుకున్న వ్యక్తలు 30 రోజుల్లోపు 5 స్టార్ ఏసీ డెలివరీ పొందవచ్చని ఆ వార్తలో ఉంది. ఈ పథకం కోసం 1.5 కోట్ల ఏసీలు సిద్ధం చేశారని, ఈ నేపథ్యంలో భారతదేశంలో భారీగా ఏసీల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు యూపీఎస్సీ మేటర్స్‌ అనే ఇన్‌స్టా పేజీలో ఈ పోస్ట్‌ చేసింది. 18 ఏళ్లు పైబడిన వారు ఉచితంగా 5-స్టార్ ఏసీను పొందేందుకు అర్హులని ఆ పోస్ట్‌లో ఉంది. ముఖ్యంగా ఏసీలు లేనివారికి 50 శాతంతగ్గింపు పొందవచ్చని పేర్కొంది. అయితే ఆ పోస్ట్‌లోని లింక్‌ క్లిక్‌ చేస్తే వినియోగదారులు రిజిస్ట్రేషన్ కోసం బీఎస్‌ఈఎస్‌ యమునా పవర్ లిమిటెడ్ వెబ్‌సైట్‌కు వెళ్తుంది. 

అయితే ఈ వైరల్‌ పోస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పీఐబీ అధికారిక హ్యాండిల్ ఈ మేరకు ఓ పోస్ట్‌ చేసింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక పోస్ట్ ‘పీఎం మోదీ ఏసీ యోజన 2025’ అనే కొత్త పథకం కింద ప్రభుత్వం ఉచితంగా 5-స్టార్ ఎయిర్ కండిషనర్లను అందిస్తుందని, అలాగే 1.5 కోట్ల ఏసీలు ఇప్పటికే సిద్ధం చేశారనే వార్త ఫేక్‌ అని స్పష్టం చేసింది.పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ డేటా ప్రకారం ఈ తరహా పథకమే లేదని పేర్కొంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ అలాంటి పథకాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి