
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ యూపీఐ వాడుతున్నారు. చిన్న దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోట యూపీఐ స్కానర్లు కనిపిస్తున్నాయి. దీంతో స్కాన్ చేసి సెకన్లలోనే పేమెంట్స్ చేస్తున్నారు. సులభంగా ట్రాన్సాక్షన్లు చేసే అవకాశం ఉండటంతో యూపీఐ అనేది బాగా పాపులర్ అయింది. అయితే ఇంటర్నెట్ లేకుండా వ్యాపారి పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్ వద్ద వినియోగదారులు చెల్లింపులు చేసేలా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సామర్థ్యాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అభివృద్ది చేస్తోంది. 2026లో ప్రముఖ టెర్మినల్ తయారీదారులు తయారు చేసిన PoS పరికరాలకు అనుమతి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. అలాగే ఆఫ్‌లైన్ టెర్మినల్‌పై NFC సామర్థ్యం గల ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా రూ. 2 వేల వరకు చెల్లింపులు చేయవచ్చు.
విమాన క్యాబిన్‌లు, భూగర్భ రైలు నెట్‌వర్క్‌ల వంటి కనెక్టివిటీ అందుబాటులో లేని ప్రాంతంలో, ఫోన్ సిగ్నల్స్ లేని ఏరియాల్లో ఈ ఫీచర్‌ను రూపొందించారు. వినియోగదారులు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మొదట తమ పరికరంలోని యూపీఐ లైట్ వాలెట్‌లోకి డబ్బును లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత వారు యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే ఆఫ్‌లైన్ టెర్మినల్‌లో ఆ బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లో యూపీఐను స్వీకరించడానికి PoS కంపెనీలకు NPCI నుండి సర్టిఫికేషన్ అవసరం అవుతుంది. సర్టిఫికేషన్ పొందిన తర్వాత వారు దానిపై ఒక అప్లికేషన్‌ను అభివృద్ది చేయనున్నారు. PoS టెర్మినల్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, మొబైల్ వాలెట్ చెల్లింపులను వ్యాపారి కస్టమర్ల నుంచి స్వీకరించవచ్చు. టెర్మినల్ చెల్లింపు అధికారాన్ని నిల్వ చేస్తుంది. అనంతరం కనెక్టివిటీ తిరిగి వచ్చిన తర్వాత దానిని ఫార్వార్డ్ చేస్తుంది.
“ఇది యూపీఐ యాప్‌ల కోసం NFC ఆధారిత వినియోగ సందర్భం. మీరు యాప్‌ను ఉపయోగించి ట్యాప్ చేస్తారు. టెర్మినల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ.. మీరు రూ. 2 వేల వరకు చెల్లించవచ్చు. ఇది ఆథరైజేషన్‌ను క్యాప్చర్ చేసి నెట్‌వర్క్ పునరుద్ధరించబడిన తర్వాత ధృవీకరణ కోసం పంపుతుంది. బ్యాంకులు, థర్డ్-పార్టీ UPI అప్లికేషన్ ప్రొవైడర్లు కూడా ఈ యాప్‌లకు ఈ సామర్థ్యాన్ని జోడించేందుకు కృషి చేస్తున్నాయి” అని సమాచారం.