Gold Auction: కరోనా మహమ్మారి(Covid) అనేక మందికి ఆర్థిక ఇబ్బందులను తీసుకొచ్చింది. చాలా మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ స్వల్పకాల అవసరాల కోసం తమ దగ్గర ఉండే తక్కువ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు(Gold Loan) పొందారు. ఆ మెుత్తాన్ని తమ వ్యాపారాల నిర్వహణకు వినియోగించారు. కానీ.. కొంతకాలంగా బంగారంపై రుణాలు తీసుకున్న వారు వాటిని సకాలంలో చెల్లించడం లేదు. దీంతో బంగారంపై రుణాలు ఇచ్చే నాన్ బ్యాంకింగ్ గోల్డ్ లోన్ కంపెనీలు వాటిని వేలం వేస్తున్నాయి. డిసెంబరు నాటికి ముగిసిన త్రైమాసికం ఈ ప్రక్రియ వేగవంతమైంది. బంగారంపై రుణాలు ఇచ్చే ప్లైవేటు నాన్ బ్యాంకింగ్ సంస్థ ముతూట్ ఫైనాన్స్(Muthoot Finance) 2021-22 ఆర్థిక సంవత్సరంలోని మూడవ త్రైమాసికంలో ఏకంగా రూ. 2,800 కోట్లు విలువైన బంగారాన్ని వేలం వేసింది.
గత సంవత్సరం వేలం వేసిన బంగారం విలువ రూ. 300 నుంచి రూ. 400 కోట్లుగా ఉంది. చాలా మంది 2020-21 ఆర్థిక సంవత్సరంలోని రెండవ త్రైమాసికంలో బంగారంపై రుణాలను తీసుకున్నారని ముతూట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముతూట్ వెల్లడించారు. కొంత మంది రుణగ్రహీతలు సమయానికి లోన్ సొమ్ము చెల్లించలేక పోయారని.. వాటి బంగారాన్ని వేలం వేసి రుణాన్ని సర్ధుబాటు చేసినట్లు వెల్లడించారు. తక్కువ ఆధాయాల కారణంగా అనేక మంది రుణాలను సమయానికి చెల్లించలేకపోయారని ఆయన పేర్కొన్నారు.
కరోనా సమయంలో(2020) దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేయగానే అనేకమంది చిన్న వ్యాపారులు బంగారంపై రుణాలు తీసుకున్నారు. కానీ కరోనా రెండో వేవ్ రావడం వల్ల సమయానికి గోల్డ్ లోన్స్ చెల్లించలేకపోయారు. బంగారాన్ని వేలంలో పోగొట్టుకున్నప్పటికీ దేశంలో చాలా మంది చిన్న వ్యాపారులు కరోనా ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదు. ఈ పరిస్థితులు మార్కెట్ లో అనేక రకాల వ్యాపారాలు ఇంకా కోలుకోలేకపోవడాన్ని సూచిస్తున్నాయని మరో సంస్థ ప్రతినిధి తెలిపారు. గతంలో కంటే బంగారం ధర తక్కువగా ఉండడం కూడా వేలానికి ప్రధాన కారణంగా నిలిచిందని నిపుణులు అంటున్నారు. దేశంలో మూడో వేవ్ కరోనా కొనసాగుతోందని.. బంగారంపై రుణాలు శాతం అనుకున్న స్థాయిలో లేదని ముతూట్ సంస్థ ప్రతినిధి అన్నారు. మార్కెట్లలో పరిస్థితులు కుదుటపడితే మళ్లీ బంగారంపై రుణాలకు డిమాండ్ పెరుగుతుందని గోల్డ్ లోన్ వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలు చెబుతున్నాయి. రానున్న సంవత్సరంలో తమ వ్యాపారం తిరిగి పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..
Petrol Diesel Price: క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఎలా
PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు రానట్లే.. అదెంటో తెలుసా..