Mukesh Ambani: ఆసియాలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త, దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం నిన్న జరిగిన విషయం తెలిసిందే. టెలికాం రంగంలో అంబానీ దూసుకెళ్తున్న అంబానీ.. సౌరశక్తిలో టాటా, ఆదానీ వంటి బడా వ్యాపారవేత్తలను దాటుకుని వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యాపార అభివృద్ధికి ఊతమిచ్చే కొత్త ఇంధనాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది రిలయన్స్. ఇందులో భాగంగా భారీ ప్రణాళికలు ఆవిష్కరించింది. వీటి ప్రకారం పర్యావరణ అనుకూల ఇంధనాలపై వచ్చే మూడేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ సెల్స్ తయారీ ప్లాంట్లు, విద్యుత్ నిల్వ చేసే బ్యాటరీల ఫ్యాక్టరీ, ఫ్యుయెల్ సెల్ తయారీ ప్లాంట్, హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎలక్ట్రోలైజర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. 2030 నాటికి 100 గిగావాట్ల (జీడబ్ల్యూ) సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను, కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు అంబానీ వెల్లడించారు. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయాల్లో దాదాపు 60 శాతం .. హైడ్రోకార్బన్ ఆధారిత ఇంధనాల కార్యకలాపాల ద్వారానే వస్తోంది.
2035 నాటికి పూర్తిగా కర్బన్ ఉద్గారాల రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్ గత సంవత్సరమే నిర్ధేశించుకుంది. ఈ దిశగా వ్యూహాలు, మార్గదర్శక ప్రణాళికలను మీ ముందు ఉంచుతున్నట్లు నిన్న చెప్పుకొచ్చారు. ఈ ప్రణాళికల అమలుపై వచ్చే మూడేళ్లలో రూ. 60,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నామని, ఇందులో భాగంగా నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఈ నాలుగు గిగా ఫ్యాక్టరీలకు అవసరమైన పరికరాల తయారీకి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ. 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు చెప్పారు. అయితే స్వచ్ఛమైన, చౌకైన శక్తికి మూలం సౌరశక్తి. దీనికి ఈ రోజుల్లో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
దీనిలో భాగంగా రూఫ్‌టాప్ సోలార్, గ్రామాల్లో సౌర విద్యుత్ మౌలిక సదుపాయాల ఏర్పాటు రూపంలో ఉండనుంది. ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను నిల్వ చేసేందుకు అత్యాధునిక బ్యాటరీల తయారీ కోసం ప్రత్యేకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విద్యుత్‌తో పాటు వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించగలిగే హరిత హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.