మరో సంచలనానికి సిద్ధమవుతున్న ముఖేష్ అంబానీ.. కేవలం రూ.14,999 జియో ఎలక్ట్రిక్ స్కూటర్..?

|

Dec 05, 2024 | 2:34 PM

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025లో భారత మార్కెట్‌లో విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి జియో కంపెనీ ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు

మరో సంచలనానికి సిద్ధమవుతున్న ముఖేష్ అంబానీ.. కేవలం రూ.14,999 జియో ఎలక్ట్రిక్ స్కూటర్..?
Jio Scooter
Follow us on

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన ముద్ర వేయడం ప్రారంభించాయి. పర్యావరణ హితం పట్ల అవగాహన పెగుతుండటంతో EVల రికార్డు అమ్మకాలు పెరగుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్ సైకిల్, లేదా ఎలక్ట్రిక్ కార్ లేదా త్రీవీలర్ లేదా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు, ప్రజలు బ్యాటరీతో నడిచే వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్ 2027 నాటికి 35-40 శాతం CAGR వద్ద వృద్ధి చెందుతుందని అంచనా. 2025 నాటికి భారతదేశంలో EV విక్రయాల వాల్యూమ్‌లు 3-4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.

ప్రస్తుతం, భారతీయ EV మార్కెట్ ద్విచక్ర వాహనం, త్రీ-వీలర్ EV సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. ఇది వాహన మార్కెట్లో 80 శాతం వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన జియో కంపెనీ అత్యాధునిక చౌక ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదీ కూడా రూ.14,999 ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది.

జియో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్ మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది భారత మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ స్కూటర్ ధర తోపాటు వాహన ఫీచర్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్రాసెస్‌తో సహా ఇతర సమాచారం మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జియో ప్రారంభంలో అందించిన చౌకైన ఫోన్ మాదిరి, స్కూటర్‌ను సైతం సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ ఆర్థికంగా మాత్రమే కాకుండా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉంటాయంటున్నారు. దీనికి శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును అమర్చారని, ఇది అధిక వేగంతో దూసుకుపోవడానికి సహాయపడుతుందంటున్నారు. అంతే కాకుండా, జియో స్కూటర్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై సుమారు 75 నుంచి 100 కి.మీల పరిధి వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ నగరాల్లో రోజువారీ ప్రయాణానికి అనువుగా ఉంటుందని భావిస్తున్నారట.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 14,999 మొదలుకుని రూ. 17,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోలిస్తే జియో స్కూటర్ ధర చాలా తక్కువగా ఉండనుందని సోషల్ మీడియా వార్తలు గుప్పుమన్నాయి. ఈ సరసమైన ధర కారణంగా, ఈ స్కూటర్ యువ కస్టమర్లకు, మొదటిసారి స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి సదవకాశంగా భావిస్తున్నారు. ఈ స్కూటర్ గనక మార్కెట్‌లోకి వస్తే, మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జియో స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితమని, దీనికి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వైరల్ అవుతున్న ప్రకటనలో పేర్కొన్నారు. విజయవంతమైన రిజిస్ట్రేషన్ తర్వాత, కస్టమర్‌లు తమ స్కూటర్‌ను డెలివరీ చేయడానికి సమీపంలోని జియో స్టోర్‌లో చూపించగలిగే రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 లో మార్కెట్‌లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి జియో కంపెనీ ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అధికారిక సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే కస్టమర్‌లకు దీనిపై అప్‌డేట్ రావచ్చు..!!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..