Email Password Leak: కోట్ల మంది ఇ–మెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్! మీది కూడా ఉందేమో ఇలా చెక్ చేసుకోండి!

ఇటీవల జరిగిన డేటా ఉల్లంఘన కారణంగా 183 మిలియన్ల ఇ–మెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్టు వార్తలొస్తున్నాయి. దీంతో కోట్లాది మంది ఇ–మెయిల్ అకౌంట్లు ప్రమాదంలో పడ్డాయి. ఈ పాస్‌వర్డ్ లీక్‌లో జీమెయిల్ సహా పలు ఇతర మెయిల్ అకౌంట్స్ కూడా ఉన్నట్టు సమాచారం. మరీ హ్యాక్ అయిన పాస్‌వర్డ్స్‌లో మీది కూడా ఉందా? ఇలా చెక్ చేసుకోండి..

Email Password Leak: కోట్ల మంది ఇ–మెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్! మీది కూడా ఉందేమో ఇలా చెక్ చేసుకోండి!
Email Password Leak

Updated on: Oct 28, 2025 | 4:34 PM

ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఇ–మెయిల్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లు హ్యాక్ అయ్యాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు. ‘హావ్ ఐ బీన్ పన్డ్’ అనే సైట్ నడుపుతున్న ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ దీని గురించిన సమాచారం ఇచ్చారు.  సుమారు 3.5 టెరాబైట్ల డేటా దొంగిలించబడిందని పేర్కొన్నారు. దీనిగురించి న్యూయార్క్ పోస్ట్ కూడా నివేదించింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం సుమారు 18.3 కోట్లు అకౌంట్లు ప్రమాదంలో ఉన్నాయట.

ఇలా చెక్ చేసుకోవచ్చు

కోట్లాది మంది పాస్‌వర్డ్‌లు లీక్ అయిన సందర్భంలో అందులో మీది కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ హ్యాక్ అయిన డేటాలో మీ పాస్‌వర్డ్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు “HaveIBeenPwned.com” అనే వెబ్‌సైట్ లోకి లాగిన్ అయ్యి  మీ పాస్‌వర్డ్ డేటా హ్యాక్ అయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత, మీరు మీ ఇమెయిల్ అడ్రెస్‌ నమోదు చేసి సెర్చ్ చేయాలి. ఒకవేళ మీ పాస్‌వర్డ్ లీక్ అయితే ఆ వివరాలు ఈ సైట్ మీకు తెలియజేస్తుంది.

పాస్‌వర్డ్ లీక్ అయితే ఏమి చేయాలి?

ఒకవేళ మీ అకౌంట్ పాస్‌వర్డ్ లీక్ అయిందని మీరు గుర్తిస్తే.. మీరు వెంటనే మీ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి. అలాగే లాగిన్ కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. పాస్‌వర్డ్ లో నెంబర్లు, సింబల్స్ ఉండేలా చూసుకోవాలి. పాస్‌వర్డ్ లో డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు లాంటివి లేకుండా ప్రత్యేకమైన పాస్‌వర్డ్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి.