భారతీయ కార్ మార్కెట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఐదు డోర్ల కాన్సెప్ట్ తో కూడిన కారును ఎట్టకేలకు ఆవిష్కరించింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో 2023లో మారుతి సుజుకి ఐదు డోర్లత కూడిన తన అప్ గ్రేడెడ్ జిమ్నీని ప్రదర్శించింది. మన దేశంలోనే ఇది ఇప్పటికే ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ విదేశాలకు ఎక్స్ పోర్టు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు దీనిని దేశీయ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. నెక్సా ద్వారా ప్రీ బుకింగ్స్ కూడా మారుతి సుజుకి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ జిమ్నీ ప్రత్యేకతలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేద్దాం..
మారుతి జిమ్నీ 5-డోర్ పొడవు 3,985ఎంఎం, వెడల్పు 1,645ఎంఎం, ఎత్తు 1,720ఎంఎం ఉంది. ఈ కారు ఇంతకు ముందు 3 డోర్ మోడల్ వీల్ బేస్ 2,250ఎంఎంతో పోలిస్తే 2,590mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఇది కొండ ప్రాంతలలో కూడా సులువుగా ప్రయాణించగల్గుతుంది. దీని ల్యాడర్ ఫ్రేమ్ కన్ స్ట్రక్షన్, ఆల్ గ్రిప్ ప్రో 4డబ్ల్యూడీ వ్యవస్థ, అత్యాధునిక బ్రేకింగ్ వ్యవస్థ కొండలపై నుంచి కిందికి దిగేటప్పుడు కూడా బాగా ఉపకరిస్తుంది. LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లాప్ టైప్ డోర్ హ్యాండిల్స్, స్లైడింగ్ రియర్ విండోతో ఆకర్షణీయంగా ఉంటుంది. క్యాబిన్ 5 సీటర్ల అమరికలో ముందువైపు 2 కెప్టెన్ సీట్లు, వెనుకవైపు ముగ్గురు ప్రయాణికులకు ఒక బెంచ్ తరహా సీటు ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఆటో , యాపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు ఆన్‌బోర్డ్ ఫీచర్‌లలో ఉన్నాయి. భద్రత కోసం మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. 5 డోర్ జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెరల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.
మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ K15B పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది . ఇది 6,000 rpm వద్ద 104 hp, 4,000 rpm వద్ద 135 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏడాది చివరిలో దీనిని వినియోగదారులకు అందించనున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. ఈ మేరకు నెక్సా డీలర్లు, లేదా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. మారుతి జిమ్నీ 5 డోర్ లాంచ్ ధర సుమారు రూ. 10-12 లక్షల వరకు ఉంటుందని అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..