LIC IPO: నెల ప్రారంభం నుంచి అందరి చూపూ ఎల్ఐసీ వైపే. అసలు ఐపీవో ప్రకటన నాటి నుంచి ఉన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమయం ఉదయం 10.10 గంటలకు రానే వచ్చింది. కానీ.. ఆశించిన దానికి భిన్నంగా జరగటం చాలా మంది ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. అదే ఎల్ఐసీ ఐపీవో లిస్టింగ్. గత కొంత కాలంగా అనేక మంది మార్కెట్ నిపుణులు, బ్రోకరేజ్ సంస్థల అంచనాలను లిస్టింగ్ నిజం చేసింది. ఎల్ఐసీ షేర్ దాదాపు ఇష్యూ ధరకంటే 8 శాతానికి పైగా తక్కువకు లిస్టింగ్ జరిగింది. బీఎస్ఈలో రూ.867, ఎన్ఎస్ఈలో రూ.872కు షేర్ లిస్టింగ్ జరిగింది. ఈ డిస్కౌంటెడ్ లిస్టింగ్ వల్ల చాలా మంది షేర్లు ఎలాట్ కాని వారు తాజాగా మార్కెట్లో తక్కువ ధరకే షేర్లను పొందగలిగారు. ఎల్ఐసీ ఐపీవోలో షేర్లు ఎలాట్ అయిన వారికి రూ.949కి అమ్మింది. దీని ప్రకారం షేర్లు పొందిన వారికి ఒక్కో షేరుకు దాదాపు రూ.85 నుంచి రూ.90 వరకు నష్టపోయారు. ప్రీ-ఓపెనింగ్ సమయంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5.5 లక్షల కోట్లను దాటింది.
అసలు ముందుగా కేంద్రం షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ.60 వేల కోట్లను సమీకరించాలని యోచించింది. ఇందుకోసం కంపెనీలో తను ఉన్న వాటాలో 5 శాతాన్ని అమ్మాలని నిర్ణయించింది. అదే సమయంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో మార్కెట్లు తీవ్రంగా ఒడిదొడుకులకు ఎదుర్కొన్నాయి. ఆ తరువాత ద్రవ్యోల్బణం పెరుగుదల, ధరల పెరుగుదల ఇలా అనేక కారణాల కారణంగా మార్కెట్లు పేలవంగా మారటంతో ఇష్యూ సైజ్ ను 3.5 శాతానికి కుదించింది కేంద్రం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఐపీవో విజయవంతంగా లిస్టింగ్ జరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాధరణతో పాటు బీమా వ్యాపారంలో అధిక మార్కెట్ షేర్ ను ఎల్ఐసీ కంపెనీ కలిగిఉంది. అందువల్ల రిటైల్ మదుపరులు ఎంటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. రానున్న కాలంలో మార్కెట్లలో కరెక్షన్ తరువాత కుదుటపడతాయని.. అందువల్ల షేర్ విలువ కూడా పెరుగుతుందని వారు అంటున్నారు. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడి ఇన్వెస్టర్లకు మంచి రాబడిని, విలువను జోడిస్తుందని వారు అంటున్నారు. మెుత్తానికి ఎల్ఐసీ షేర్ల విషయంలో అందరూ అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి.