LIC IPO: ఎల్ఐసీ ఐపీఓలో ఎవరికి ఎన్ని షేర్లు ఇవ్వనుంది.. ఎల్ఐసీ దాచిన వాస్తవాలు ఇప్పుడు మీకోసం..

|

Feb 19, 2022 | 9:38 AM

LIC IPO:  దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ జీవితబీమా కంపెనీ ఎల్ఐసీ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీ వద్ద ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. ఈ 652 పేజీల ప్రాస్పెక్టస్ లోని అంశాలు చాలా కీలకమైనవి. ఎల్ఐసీ వ్యాపార కార్యకలాపాల..

LIC IPO:  దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ జీవితబీమా కంపెనీ ఎల్ఐసీ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీ వద్ద ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. ఈ 652 పేజీల ప్రాస్పెక్టస్ లోని అంశాలు చాలా కీలకమైనవి. ఎల్ఐసీ వ్యాపార కార్యకలాపాల మ్యానేజ్ మెంట్ లో ఇవి చాలా కీలకం కానున్నాయి. ఈ పేజీలలో ఎల్ఐసీ చాలా సంవత్సరాలుగా దాచి ఉంచిన అనేక అంశాలను వెలుగులోకి తీసుకురానుంది. మరోసారి ఎల్ఐసీ దేశంలోనే బీమా వ్యాపారంలో రారాజని మీరు చెప్పడానికి అవసరమైన అనేక గణాంకాలు ఈ ప్రాస్పెక్టస్ లో ఆధారాలుగా నిలువనున్నాయి. దేశంలో ప్రీమియం పరంగా 64.1 శాతం మార్కెట్ వాటాను ఎల్ఐసీ కలిగి ఉంది. కొత్త బిజినెస్ ప్రీమియం విభాగంలో ఈ వాటా 66.2 శాతంగా ఉంది. అయితే 2020-21 సంవత్సరానికి గాను  టర్మ్ ఇన్సూరెన్స్ విభాగంలో కొత్త బిజినెస్ ప్రీమియం విషయానికి వస్తే ఎల్ఐసీకి కేవలం 0.33 శాతం మార్కెట్ వాటా కలిగి ఉందని తెలుస్తోంది. కొత్త బిజినెస్ ప్రీమియం అంటే.. ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీని విక్రయించడం ద్వారా ఎల్ఐసీకి వచ్చిన ప్రీమియం అని అర్థం.

వ్యక్తిగత పాలసీల విభాగంలో ఎల్ఐసీదే సింహభాగమని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ కేటగిరీలో సంస్థకు 74.6 శాతం మార్కెట్ వాటా ఉంది. అంటే దీనికి అర్థం.. దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10 కొత్త బీమా పాలసీల్లో 7 ఎల్ఐసీకి చెందినవేనని యూబీఎస్ వెల్లడించిన ఒక నివేధిక చెబుతోంది.
దేశంలోని అనేక మంది తమ మెుత్తం డిపాజిట్లలో 10 శాతాన్ని ఎల్ఐసీలో పెడుతున్నారని నివేధిక చెబుతోంది. వినియోగదారల ఈ ప్రవర్తన కారణంగా LIC దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా మారింది. దీని వల్ల ఎల్ఐసీ రూ. 39 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉంది. దేశంలోని అన్ని మ్యూచువల్ ఫండ్‌లు పెట్టిన పెట్టుబడి విలువకు సరిసమానంగా.. ఎల్ఐసీ కలిగి ఉన్న ఆస్తుల విలువ ఉన్నదని దీనిని బట్టి మనకు తెలుస్తోంది.

ఎల్ఐసీ ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లను తన పెట్టుబడులతో శాసిస్తోంది. 9 లక్షల 76 వేల కోట్ల విలువైన వివిధ కంపెనీల షేర్లను ఇప్పటికే ఎల్ఐసీ కలిగి ఉంది. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల మొత్తం ఈక్విటీ ఎసట్స్ అండర్ మేనేజ్ మెంట్ లో ఎల్ఐసీ 29 శాతం వాటా కలిగి ఉండగా.. దేశంలోని ఈక్విటీ మార్కెట్లలో ఎల్ఐసీ వాటా దాదాపు 4 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వం తరువాత ఎల్ఐసీ రెండవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎల్ఐసీ ఎక్కువశాతం తన వాటాలను కలిగి ఉంది. అందువల్ల దేశంలోని ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు వస్తున్న ఎల్ఐసీ ఐపీఓ పైనే ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ తన ఐపీఓలో పాలసీదారులకోసం ఉంచిన భాగంలో మిగిలిన కొంత మెుత్తాన్ని షేర్ హోల్డర్ల కోసం రిజర్వ్ చేసింది.

ఈ పరిణామం వల్ల ఎల్ఐసీలో ప్రభుత్వంతో పాటు మిగిలిన షేర్ హోల్డర్ల వాటా 5 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. పాలసీదారులు పొందాల్సిన మెుత్తం సొమ్ము 95 శాతం నుంచి 90 శాతానికి తగ్గింది. గడచిన మూడు సంవత్సరాలుగా ఎల్ఐసీ తనకు వచ్చిన లాభంలో రూ. 8 వేల 247 కోట్లను ప్రభుత్వానికి చెల్లించింది. దీనిని బట్టి పాలసీదారులతో పాటు ప్రభుత్వం విషయంలోనూ ఎల్ఐసీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సెబీకి ఇచ్చిన సమాచారం ద్వారా ఎల్ఐసీ తన వాస్తవ పరిమాణాన్ని మనకు తెలియజేస్తోంది. ఇందు వల్ల ఎల్ఐసీ ఐపీఓను విజయవంతంగా పూర్తి చేసి దలాల్ స్టీట్ లో నిలపాలని ప్రభుత్వం చూస్తోంది.

ఇవీ చదవండి..

Air India: టాటాలు దిద్దిన కాపురం.. ఎయిరిండియాను గాడిలో పెట్టెందుకు పక్కా ప్లాన్స్ రెడీ.. భారీ ప్రణాళికల వివరాలు

Phone Pe: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫోన్ పే.. అలా చేసిన వారికి రూ. 5 లక్షలు ప్రైజ్ మనీ..

Published on: Feb 19, 2022 08:41 AM