
అత్యధికంగా అమ్ముడైన వ్యక్తిగత ఫైనాన్స్ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి “చరిత్రలో అతిపెద్ద మార్కెట్ క్రాష్” ఈ వేసవిలో ప్రారంభమవుతుందని హెచ్చరించారు. పెట్టుబడిదారులను స్టాక్‌లు, బాండ్ల నుండి బయటకు వెళ్లి బంగారం , వెండి, బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులల్లో పెట్టుబడి పెట్టుకోవాలని కోరారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. “నేను హెచ్చరించలేదని చెప్పకండి. నా పుస్తకం రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో ఊహించినట్లుగా చరిత్రలో అతిపెద్ద క్రాష్ రాబోతోంది. క్రాష్ సమయం ఇప్పుడు, ఈ వేసవి అంతా ఉంటుందని నేను భయపడుతున్నాను.”
“స్టాక్, బాండ్ మార్కెట్లు కుప్పకూలినప్పుడు లక్షలాది మంది, ముఖ్యంగా నా తరం బూమర్లు తుడిచిపెట్టుకుపోతారు” అని కియోసాకి హెచ్చరించారు. అదే సమయంలో “ముందుకు సాగే లక్షలాది మంది చాలా ధనవంతులు కావచ్చు, మీకు తెలిసినట్లుగా.. మీరు చాలా ధనవంతులు అయ్యే వారిలో ఒకరిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఈ తిరోగమనం ఈక్విటీలు, బాండ్లకే పరిమితం కాదని కియోసాకి అన్నారు. “ఈ వేసవిలో, స్టాక్, బాండ్, రియల్ ఎస్టేట్ మార్కెట్లు కుప్పకూలినప్పుడు… బిలియన్ల మంది బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల వైపు చూస్తారు” అని ఆయన రాశారు.
కాగితపు పెట్టుబడుల కంటే భౌతిక ఆస్తులకే తన ప్రాధాన్యతను పునరుద్ఘాటిస్తూ.. రేపు నేను నా స్థానిక బంగారం, వెండి డీలర్ వద్దకు వెళ్లి నిజమైన వెండిని కొనుగోలు చేస్తానని అన్నారు. కియోసాకి తన అనుచరులను తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. “వెండి ధర ఔన్సుకు దాదాపు 35 డాలర్లుగా ఉంది, అంటే ప్రపంచంలో ఎక్కడైనా దాదాపు ప్రతి ఒక్కరూ.. ధనవంతులు అయ్యే అవకాశం ఉంది.. లక్షలాది మంది పేదలు అవుతారు.” “రేపు మీరు ఏమి చేయబోతున్నారు.. ధనవంతులు అవుతారా లేదా పేదవారు అవుతారా? దయచేసి ధనవంతులు కావడానికి ఎంచుకోండి. జాగ్రత్తగా ఉండండి.” అని అన్నారు. సాంప్రదాయ ఆర్థిక వ్యూహాల నుండి దూరంగా ఉండాలని పిలుపునిస్తూ, ఆస్తుల సేకరణ వ్యవస్థాపకత ద్వారా వ్యక్తులు స్వావలంబన పొందాలని ఆయన కోరారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..