భూమిలో బంగారం కథ ముగిసిందా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది తెలిస్తే నోరెళ్లబెడతారు..

తరతరాలుగా సంపదకు చిహ్నంగా కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా ఆదుకుంటుంది బంగారం. ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే పెరుగుతున్న డిమాండ్, విపరీతమైన మైనింగ్ చూస్తుంటే.. భవిష్యత్తులో భూమిపై బంగారం నిల్వలు పూర్తిగా ఖాలీ అయిపోతాయా? అన్న సందేహం సగటు మనిషిని కలవరపెడుతోంది. ఈ క్రమంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ఈ అంశంపై విస్తుపోయే నిజాలను బయటపెట్టింది.

భూమిలో బంగారం కథ ముగిసిందా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది తెలిస్తే నోరెళ్లబెడతారు..
Is The World Running Out Of Gold

Updated on: Mar 15, 2026 | 2:54 PM

శతాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, విలువైన లోహంగా వెలుగొందుతున్న బంగారం భవిష్యత్తుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో అసలు భూమిలో బంగారం అయిపోతుందా? అనే ప్రశ్నకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన 2025 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో ఆసక్తికరమైన సమాధానాలను వెల్లడించింది. గత ఏడాది బంగారు మైనింగ్ రంగం సరికొత్త మైలురాయిని అధిగమించింది. నివేదిక ప్రకారం.. 2025లో ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ కంపెనీలు 3,672 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేశాయి. ఇది మునుపటి ఏడాది కంటే 1 శాతం ఎక్కువ. అందుబాటులో ఉన్న చారిత్రక డేటా ప్రకారం ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. 2026లో రెండు ప్రధాన గనుల్లో పనులు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.

బంగారం ఎప్పటికీ అంతం కాదు.. ఎందుకు?

భూమిలో బంగారం నిల్వలు తగ్గిపోతాయేమో అన్న ఆందోళన అవసరం లేదని నివేదిక స్పష్టం చేస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..

రీసైక్లింగ్: బంగారం ఎప్పటికీ నాశనం కాని లోహం. ప్రస్తుతం భూమి పైన దాదాపు 2,19,891 టన్నుల బంగారం అందుబాటులో ఉంది. మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు, పాత ఆభరణాలను అమ్మడం లేదా పారిశ్రామిక వ్యర్థాల నుండి బంగారాన్ని సేకరించడం పెరుగుతుంది. మైనింగ్ కంటే ఈ ప్రక్రియ చాలా వేగంగా మార్కెట్ అవసరాలను తీరుస్తుంది.

భూగర్భ నిల్వలు: అంచనాల ప్రకారం.. ఇంకా భూమిలో 54,770 నుండి 64,000 టన్నుల వరకు ధృవీకరించబడిన నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా భౌగోళిక నమూనాల ప్రకారం మరో 1,32,110 టన్నుల బంగారం భూగర్భంలో ఉండే అవకాశం ఉంది.

సాంకేతికతతో కొత్త ఆశలు

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ గతంలో తవ్వడానికి వీలు పడని లోతైన ప్రాంతాల నుండి కూడా బంగారాన్ని వెలికితీసే సామర్థ్యం పెరుగుతోంది. సిద్ధాంతపరంగా భూమి క్రస్ట్ లోపల, సముద్రపు అడుగుభాగంలో అపారమైన బంగారు నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మైనింగ్ ద్వారా వచ్చే కొత్త బంగారం వాటా స్థిరంగా ఉన్నప్పటికీ.. రీసైక్లింగ్ పద్ధతులు, ఆధునిక మైనింగ్ టెక్నాలజీ వల్ల రాబోయే తరాలకు బంగారు కొరత ఏర్పడే అవకాశం చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us