Indian IPO: ఫుడ్, ఎనర్జీ, బియ్యం.. త్వరలో మార్కెట్‌లోకి ఈ కంపెనీల ఐపీవోలు!

భారత క్యాపిటల్ మార్కెట్లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPO) సందడి కొనసాగుతోంది. కేటరింగ్, ఆహార సేవలు, బాస్మతి బియ్యం, పునరుత్పాదక ఇంధనం వంటి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు తమ ముసాయిదా ప్రాస్పెక్టస్ (DRHP) పత్రాలను సెబీకి సమర్పించాయి. ఇది రాబోయే నెలల్లో పబ్లిక్ లిస్టింగ్‌ల వైవిధ్యాన్ని, మార్కెట్ వృద్ధిని సూచిస్తుంది.

Indian IPO: ఫుడ్, ఎనర్జీ, బియ్యం.. త్వరలో మార్కెట్‌లోకి ఈ కంపెనీల ఐపీవోలు!
New Ipos In Indian Markets

Updated on: Jun 30, 2025 | 6:11 PM

కేటరింగ్, ఫుడ్ రిటైల్ చెయిన్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఫుడ్‌లింక్ F&B హోల్డింగ్స్ (ఇండియా) తన IPO కోసం సెబీకి పత్రాలు సమర్పించింది. ఈ IPOలో రూ. 160 కోట్ల విలువైన తాజా షేర్లు ప్రమోటర్లు, ఇన్వెస్టర్ సెల్లింగ్‌హోల్డర్లు 1.19 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటాయి. ప్రీ-IPO ప్లేస్‌మెంట్ ద్వారా కంపెనీ రూ.32 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.

సేకరించిన నిధులను రెండు కొత్త సెంట్రలైజ్డ్ కిచెన్లు, ఫుడ్‌లింక్ గ్లోబల్ రెస్టారెంట్స్ & కేటరింగ్ సర్వీసెస్‌లో కొత్తగా నాలుగు క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు వినియోగించనున్నారు. అలాగే, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కూడా నిధులు కేటాయిస్తారు. ముంబైకి చెందిన ఈ సంస్థ అంతర్జాతీయ లగ్జరీ ఫుడ్ సర్వీసుల వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. భారత్, యూఏఈలలో ఇండియా బిస్ట్రో, ఆర్ట్ ఆఫ్ దమ్ వంటి ఫ్లాగ్‌షిప్ బ్రాండ్‌ల కింద 30 క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్‌లు ఉన్నాయి. ఈ షేర్లు BSE, NSEలలో లిస్ట్ అవుతాయి. ఈక్విరస్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు.

క్యూర్‌ఫుడ్స్ ఇండియా లిమిటెడ్

ఇంటర్నెట్ ఆధారిత మల్టీ-బ్రాండ్ ఫుడ్ సేవల కంపెనీ అయిన క్యూర్‌ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ కూడా తన IPO DRHPను సెబీకి సమర్పించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పరంగా ఇది రెండో అతి పెద్ద డిజిటల్ ఫస్ట్ ఫుడ్ సేవల సంస్థ. పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీ రూ.800 కోట్ల వరకు తాజా షేర్లను జారీ చేస్తుంది. అదనంగా, 4,85,37,599 వరకు ఈక్విటీ షేర్లను సెల్లింగ్ షేర్‌హోల్డర్లు OFS విధానంలో విక్రయిస్తారు.

సేకరించిన నిధుల్లో రూ.152.54 కోట్లను కార్యకలాపాల విస్తరణ, పరికరాల కొనుగోలుకు వినియోగిస్తారు. ఇందులో కొత్త క్రిస్పీ క్రీమ్ క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లు, కియోస్క్‌లు, సెంట్రల్ కిచెన్‌ల ఏర్పాటు; ప్రస్తుత క్లౌడ్ కిచెన్లకు కొత్త బ్రాండ్లు జోడించి విస్తరించడం; యంత్ర పరికరాల కొనుగోలు, వ్యూహాత్మక కార్యక్రమాలు వంటివి ఉన్నాయి. క్యూర్‌ఫుడ్స్ భారత్‌లో 70 నగరాలు, పట్టణాల్లో 502 సర్వీస్ లొకేషన్లవ్యాప్తంగా కార్యకలాపాలు నడుపుతోంది. ఈట్‌ఫిట్, కేక్‌జోన్, ఓలియో పిజ్జా వంటి బ్రాండ్లు ఈ సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

అమీర్‌చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్

బాస్మతి బియ్యం, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతి వ్యాపారం నడుపుతున్న అమీర్‌చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్ (“ఏరోప్లేన్” బ్రాండు) తన IPO DRHPను సెబీకి సమర్పించింది. ఈ IPO ద్వారా కంపెనీ రూ.550 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూ పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉంటుంది. నిధులను నిర్వహణ మూలధన అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు.

బాస్మతి బియ్యం పరిశ్రమలో కంపెనీకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఆదాయం పరంగా పోటీదారులతో పోలిస్తే ఇది మూడో స్థానంలో ఉంది. “ఏరోప్లేన్” ఫ్లాగ్‌షిప్ బ్రాండు కింద 40కి పైగా సబ్-బ్రాండ్‌ల పేరిట ఆటా, మైదా, సూజీ, ఉప్పు వంటి వివిధ ఉత్పత్తులు విక్రయిస్తోంది. కంపెనీకి 100 ట్రేడ్‌మార్క్‌లు ఉన్నాయి. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కేఫిన్ టెక్నాలజీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

జునిపర్ గ్రీన్ ఎనర్జీ DRHP సమర్పణ

పునరుత్పాదక స్వతంత్ర విద్యుదుత్పత్తి రంగ సంస్థ జునిపర్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తన IPO కోసం సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇది పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉంటుంది.

సేకరించిన నిధుల్లో కొంత భాగాన్ని రూ.1,092.27 కోట్ల వరకు రుణాల చెల్లింపునకు అనుబంధ సంస్థల రుణాలను తీర్చివేసేందుకు రూ.1,157.72 కోట్ల వరకు; మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తారు. 2024 డిసెంబర్ 31 నాటికి మొత్తం సామర్థ్యం పరంగా భారత్‌లోని టాప్ 10 పునరుత్పాదక స్వతంత్ర విద్యుదుత్పత్తి దిగ్గజాల్లో జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఒకటి. ఇది సౌర, పవన విధానాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. 2020 మార్చిలో కంపెనీ తొలి సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. 2025 మే 31 నాటికి మొత్తం సామర్థ్యం 7,898.45 మెగావాట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.