
ఊహించనట్టుగానే సెమీకండక్టర్ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఈ రోజు (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశ సెమీ కండక్టర్ రంగం వృద్ధి కోసం సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.ఓ ప్రకటించారు. భారత్‌ను సెమీకండక్టర్ హబ్‌గా మార్చడంలో భాగంగా రూ.40 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అలాగే రూ.10వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని మంత్రి ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించారు. అంతకుముందు బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేంద్ర మంత్రి అందజేశారు. కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.
భారత్‌ను సెమీకండక్టర్ మిషన్ (ISM) దేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రూ.76,000 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభించింది. ఇది సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు, చిప్ డిజైన్ తయారీకి 50 శాతం వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. సెమీకండక్టర్ రంగం వృద్ధి కోసం సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కింద రూ.40,000 కోట్లు కేటాయించారు. భారతదేశంలో సెమీకండక్టర్, డిస్‌ప్లే ఎకో సిస్టమ్ నిర్మించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి