India GDP Growth: 2025లో భారత్ జీడీపీ వృద్ధి 6.3 శాతం అంచనా.. యూఎన్ కీలక వ్యాఖ్యలు
భారత్ జీడీపీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధించనుందని సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా భారత్ వీటిని అధిగమించగలదని చెప్పారు. వాణిజ్య అవరోధాలు పెరుగుతున్న ఈ తరుణంలో ద్వైపాక్షిక ఒప్పందాలు కొనసాగించడం..

భారత జీడీపీ 2025 సంవత్సరానికి గానూ 6.3 శాతం ఉండనుందని ఐక్యరాజ్యసమతి అంచనా వేస్తోంది. ఆర్ధిక వృద్ది తక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఐరాసా తెలిపింది. స్థిరమైన వినియోగం, ప్రభుత్వ వ్యయం మద్దతుగా దేశం పెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. గురువారం ఐక్యరాజ్యసమితి ఓ కీలక నివేదికను విడుదల చేసింది. ‘2025 మధ్యలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి- అవకాశాలు’ పేరిట ఈ రిపోర్ట్ వెలువడింది.
‘2025లో వృద్ధి అంచనాలను 6.3 శాతానికి తగ్గించినప్పటికీ, బలమైన ప్రైవేట్ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది’ అని UN ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, విధానపరమైన అనిశ్చితి నెలకొనడం లాంటి సమస్యలు తలెత్తడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇటీవల US సుంకాల రేటును పెంచడంతో.. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఇది గ్లోబల్ సప్లై చైన్‌ను దెబ్బ తీసింది. అలాగే ఆర్థిక సంక్షోభం ముప్పు వాటిల్లింది.
రిపోర్ట్ ఓ అంచనా అయినప్పటికీ.. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని.. దీనికి స్థిరమైన వినియోగం, ప్రభుత్వ వ్యయం మద్దతు ఇస్తోందని నివేదిక పేర్కొంది. 2024లో 7.1 శాతంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. ‘యునైటెడ్ స్టేట్స్ సుంకాలు వస్తు ఎగుమతులపై ప్రభావం చూపుతున్నప్పటికీ, ప్రస్తుతం మినహాయింపు పొందిన రంగాలు – ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఎనర్జీ, రాగిగా ఉన్నాయి. ఇవి ఆర్థిక ప్రభావాన్ని పరిమితం చేయవచ్చు. అయితే ఈ మినహాయింపులు శాశ్వతంగా ఉండకపోవచ్చు’ అని ఐరాస పేర్కొంది.
2025లో భారతదేశానికి 6.3 శాతం వృద్ధి అంచనా.. ఈ సంవత్సరం జనవరిలో ప్రచురించబడిన UN ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రాస్పెక్ట్స్ 2025(6.6 శాతం) కంటే కొంచెం తక్కువే అయినప్పటికీ.. 2026కి భారతదేశ GDP వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో స్థిరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య నిరుద్యోగం చాలావరకు స్థిరంగా కొనసాగుతోంది. భారతదేశంలో ద్రవ్యోల్బణం 2024లో 4.9 శాతం నుంచి 2025లో 4.3 శాతానికి తగ్గుతుందని కేంద్ర బ్యాంకు టార్గెట్ రేంజ్‌లోనే ఉంటుందని నివేదిక పేర్కొంది.
తగ్గుతున్న ద్రవ్యోల్బణం దక్షిణాసియా ప్రాంతంలోని చాలా కేంద్ర బ్యాంకులు 2025లో ద్రవ్య సడలింపును ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి అనుమతించింది. ఫిబ్రవరి 2023 నుంచి తన పాలసీ రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచిన భారత రిజర్వ్ బ్యాంక్, ఫిబ్రవరి 2025లో తన సడలింపు సైకిల్ ప్రారంభించిందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ప్రభుత్వాలు IMF మద్దతు ఉన్న కార్యక్రమాల కింద ఆర్థిక ఏకీకరణ, ఆర్థిక సంస్కరణలను కొనసాగించాలని భావిస్తున్నాయి. ప్రపంచ GDP వృద్ధి ఇప్పుడు 2025లో కేవలం 2.4 శాతంగా అంచనా వేస్తుండగా.. ఇది 2024లో 2.9 శాతంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2025కి 2.4 శాతంగా, 2026కి 2.5 శాతంగా అంచనా వేసింది ఐరాస.
ఇక అమెరికాలో వృద్ధి 2024లో 2.8 శాతం నుంచి 2025లో 1.6 శాతానికి గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. అధిక సుంకాలు, విధాన అనిశ్చితి ప్రైవేట్ పెట్టుబడి, వినియోగంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం చైనా వృద్ధి 4.6 శాతానికి మందగించవచ్చని అంచనా. ఇది వినియోగదారుల సెంటిమెంట్‌ను, ఎగుమతి ఆధారిత తయారీలో అంతరాయాలు, కొనసాగుతున్న ఆస్తి రంగ సవాళ్లను ప్రతిబింబిస్తుంది. బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికాతో సహా అనేక ఇతర ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కూడా వాణిజ్యం బలహీనపడటం, పెట్టుబడులు మందగించడం, వస్తువుల ధరలు తగ్గడం వల్ల వృద్ధి తగ్గుదలలను ఎదుర్కొంటున్నాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఈ ఆర్థిక అనిశ్చిత ఉద్యోగాలను సృష్టించడం, పేదరికాన్ని తగ్గించడం, అసమానతలను పరిష్కరించే అవకాశాలను దెబ్బతీస్తుందని ఐరాస పేర్కొంది. 2024లో 4.5 శాతం నుంచి 2025లో 4.1 శాతానికి వృద్ధి మందగించవచ్చని అంచనా వేశారు.




