Indian Railways: ఏపీ ప్రజలకు రైల్వేశాఖ నుంచి ఎగిరి గంతేసే వార్త.. పండుగ వేళ బంపర్ న్యూస్

సంక్రాంతికి ఇంటికెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను అందబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే అనేక రైళ్లను ప్రవేశపెట్టగా.. తాజాగా మరికొన్ని రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వివరాలు ఇలా..

Indian Railways: ఏపీ ప్రజలకు రైల్వేశాఖ నుంచి ఎగిరి గంతేసే వార్త.. పండుగ వేళ బంపర్ న్యూస్
Indian Railway

Updated on: Jan 13, 2026 | 7:24 AM

సంక్రాంతికి ఇంటికెళ్లే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. ఇప్పటికే పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ప్రత్యేక రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. దీంతో హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు రైల్వేశాఖ మరో భారీ శుభవార్త అందించింది. ఏకంగా 12 జన్ సాధారణ్ ట్రైన్లను కొత్తగా తీసుకొచ్చింది.

టైమింగ్స్ ఇవే..

విజయవాడ-విశాఖపట్నం మధ్య 12 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. విశాఖపట్నం-విజయవాడ(08567), విజయవాడ-విశాఖపట్నం(08568) రైళ్లు జనవరి 12,13,14,16,17,18వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ట్రైన్ నెంబర్(08567) విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 16.00 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఇక ట్రైన్ నెంబర్(08568) రైలు విజయవాడలో 18.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 12.35 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో ఆగుతాయి

ఈ 12 జన్ సాధారణ్ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకొట, రాజమండ్రి, నిడదవొలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్లలో ఆగుతాయి. ఇక ఈ నెల 18,19వ తేదీల్లో తిరుపతి-చర్లపల్లి, కాకినాడ-చర్లపల్లి మధ్య స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ తీసుకొచ్చింది. తిరుపతి-చర్లపల్లి(07483) ఈ నెల 18వ తేదీన 21.50 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 11.45 గంటలకు చేరుకుంటుంది. ఇక చర్లపల్లి-తిరుపతి రైలు(07482) ఆదివారం నాలుగు గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 19.00 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అలాగే చర్లపల్లి-కాకినాడ టౌన్(07480) ప్రత్యేక రైలు ఉదయం 10 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 21.30 గంటలకు చేరుకుంటుంది. ఇక కాకినాడ-చర్లపల్లి(07481) ప్రత్యేక రైలు 23.15 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 11.45 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 19వ తేదీ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇక 13వ తేదీ తిరుపతి-చర్లపల్లి(07000), అనకాపల్లి-సికింద్రాబాద్(07060), హైదరాబాద్-భువనేశ్వర్(07165), షాలిమార్-చర్లపల్లి(07226), సికింద్రాబాద్-నర్సాపూర్(07247) ప్రత్యేక రైళ్లు సర్వీసులు అందించనున్నాయి.  ఇక సికింద్రాబాద్-కాకినాడ(07261), శ్రీకాకుళం-సికింద్రాబాద్(07291), వికారాబాద్-శ్రీకాకుళం(07294), లింగంపల్లి-కాకినాడ(07446) కూడా జనవరి 13వ తేదీన అందుబాటులో ఉంటాయి.