
భారతీయ పెట్టుబడిదారుల ఆలోచనా విధానం వేగంగా మారుతోంది. గతంలో దేశీయ మార్కెట్లకే పరిమితమైన ఇన్వెస్టర్లు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎదుగుతున్న రంగాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ పరిశ్రమ, దక్షిణ కొరియా టెక్నాలజీ కంపెనీలు, జపాన్ తయారీ రంగం, చైనా వినియోగదారుల మార్కెట్ వంటి అవకాశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే విదేశీ పెట్టుబడులపై భారతీయ నియంత్రణ సంస్థలు విధించిన పరిమితులు ఇప్పుడు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి. విదేశీ మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల కోసం పరిశ్రమ స్థాయిలో నిర్దిష్ట పరిమితులను RBI, సెబీ అమలు చేస్తున్నాయి. దీంతో చాలా అంతర్జాతీయ ఫండ్లు కొత్త పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేశాయి.
ఈ పరిస్థితుల్లో గుజరాత్‌లోని GIFT City భారతీయ పెట్టుబడిదారులకు కొత్త మార్గంగా ఎదుగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంగా రూపొందిన ఈ వేదిక ద్వారా విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం అమెరికా మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం మాత్రమే నిజమైన వైవిధ్యం కాదని చెబుతున్నారు. ప్రపంచ సాంకేతిక రంగాన్ని నడిపిస్తున్న తైవాన్, కొరియా వంటి ఆసియా దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన గ్లోబల్ ఎక్స్‌పోజర్ లభిస్తుందని సూచిస్తున్నారు.
ప్రస్తుతం మిరే అసెట్, మోతీలాల్ ఓస్వాల్, HDFC AMC వంటి సంస్థలు గిఫ్ట్ సిటీ ద్వారా అంతర్జాతీయ ఫండ్ నిర్మాణాలను అందిస్తున్నాయి. అలాగే DSP, Edelweiss, PPFAS వంటి సంస్థలు గ్లోబల్, ఆసియా మార్కెట్లకు అనుసంధానమైన ప్రత్యేక ఫండ్లను నిర్వహిస్తున్నాయి. పెట్టుబడిదారులు సరళీకృత రెమిటెన్స్ పథకం (LRS) ద్వారా ఏడాదికి 2.5 లక్షల డాలర్ల వరకు విదేశాలకు పంపవచ్చు. అయితే రూ.10 లక్షలకు మించిన మొత్తాలపై 20 శాతం టీసీఎస్ వర్తించడం గమనించాల్సిన అంశం. అయినప్పటికీ ఈ మొత్తం తరువాత పన్ను రిటర్న్‌లో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గిఫ్ట్ సిటీ ద్వారా పెట్టుబడులు పెట్టడం భారతీయులకు గ్లోబల్ మార్కెట్లలో కొత్త అవకాశాలను అందిస్తున్నప్పటికీ, అధిక ఖర్చులు మరియు కొన్ని ఫండ్లలో భారీ కనీస పెట్టుబడి పరిమితులు ఉండటం చిన్న పెట్టుబడిదారులకు సవాలుగా మారవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి