International Space Station: అంతరిక్షమే హద్దుగా.. ఐఎస్ఎస్‌కు వెళ్లనున్న భారత వ్యోమగామి

అంతరిక్ష రంగంలో మన దేశం ఎన్నో విజయాలను సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికా తదితర దేశాలు కూడా మన సాంకేతికను అభినందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయడం, మెరుగైన ఫలితాలు సాధించడం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రత్యేకత. సైకిల్ పై రాకెట్లను తరలించిన పరిస్థితి నుంచి వివిధ దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే స్థాయి వరకూ మనదేశం ఎదిగింది. ఇప్పుడు మరో కొత్త చరిత్రను రాయడానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాది మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్)కు వ్యోమగామిని పంపనుంది.

International Space Station: అంతరిక్షమే హద్దుగా.. ఐఎస్ఎస్‌కు వెళ్లనున్న భారత వ్యోమగామి
Shubhanshu Shukla

Updated on: Apr 22, 2025 | 5:00 PM

ఇటీవల ఢిల్లీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సీనియర్ ఇస్రో అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దాని అనంతరం అంతరిక్షయానానికి సంబంధించిన కీలక ప్రకటనను విడుదల చేశారు. దాని ప్రకారం ఆక్సియమ్ స్పేస్ కు సంబంధించిన యాక్స్ 4 మిషన్ లో భాగంగా భారత వైమానికి దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా వచ్చే నెలలో ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు. 1984లో రాకేష్ శర్మ సోవియట్ సోయూజ్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. అది జరిగిన దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు శుభాన్షు శుక్లా అంతరిక్షానికి వెళ్లనున్నారు.

శుక్లా యాత్రతో అంతరిక్ష రంగంలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఆయన మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దాన్ని సందర్శించిన మొదట భారతీయ వ్యోమగామిగా ఆయన అవతరించనున్నారు. శుభాన్షు 1985లో ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జన్మించారు. భారత వైమానిక దళంలో యుద్ద పైలట్ గా పనిచేస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఆయన 2006 జూన్ 17న యుద్ధ విమానంలో నియమితులయ్యారు. గగన్ యాన్ మిషన్ కోసం 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుక్లా కూడా ఒకరు.

ఆక్సియమ్ మిషన్ (యాక్స్ 4) లో భాగంగా శుభాన్షు శుక్లా 14 రోజుల పాటు ఐఎస్ఎస్ లో గడుపుతారు. అక్కడ ఆయన కనీసం ఏడు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇస్రో. నానా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల సహకారంతో జరుగుతున్న యాక్స్ 4 మిషన్ లో యునైటెడ్ స్టేట్స్, హంగేరీ, పోలాండ్ వ్యోమగాములు కూడా ఉంటారు.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) అనేది భూమి చుట్టూ కక్ష్యంలో తిరుగుతున్న పెద్ద అంతరిక్ష నౌక. ఇది వ్యోమగాములు నివసించడానికి, శాస్త్రీయ పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతుంది. అన్ని దేశాలు కలిపి దీన్ని నిర్మించాయి. భూమికి చాలా దగ్గరగా, సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇక్కడ జరిగే పరిశోధనలతో అంతరిక్షంపై మనకు అవగాహన కలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి