2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. పెట్టుబడులతో రావాలంటూ.. IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిలుపు!

|

Dec 08, 2024 | 11:16 AM

2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లను సులభంగా తాకగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్. కె.వి. సుబ్రమణియన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. పెట్టుబడులతో రావాలంటూ..  IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిలుపు!
Kv Subramanian, Executive Director For India At Imf
Follow us on

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)లో భారతదేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కెవి సుబ్రమణియన్ వాషింగ్టన్‌లో జరిగిన ‘US-India Strategic and Partnership Forum’ (USISPF) కార్యక్రమంలో మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందన్నారు. భారత ఆర్థికాభివృద్ధి అమెరికా పెట్టుబడిదారులకు అపూర్వమైన అవకాశాలను కల్పిస్తుందన్నారు. అమెరికన్ పెట్టుబడిదారులకు లభించే అవకాశాలు నిజంగా అపూర్వమైనవని వివరించారు. రాబోయే 20 ఏళ్లలో మరే ఇతర ఆర్థిక వ్యవస్థ కూడా ఇటువంటి లాభాలను అందించలేదన్నారు. సుబ్రమణియన్ తన కొత్త పుస్తకం ‘ఇండియా ఎట్ ది రేట్ 100: ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్‌హౌస్’ ఆవిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికన్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సుబ్రమణియన్ అన్నారు. భారతదేశంపై దృష్టి సారించిన పెట్టుబడిదారులు ‘వాస్తవానికి తమ డబ్బును రెట్టింపు కాకుండా మూడు రెట్లు పెంచుకునే అవకాశం ఉంది’ అని ఆర్థికవేత్త సుబ్రమణియన్ చెప్పారు. భారత ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్న సుబ్రమణియన్, భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా 15 నుండి 20 రెట్లు పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు. సుబ్రమణియన్ తన పుస్తకంలో భారతదేశం 25 ఏళ్లలోపు 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా మారగలదని వివరించారు. దీని కోసం ఆర్థిక వ్యవస్థలో బలమైన సంస్కరణలు చేయవలసి ఉంటుందని చెప్పారు. 2014 తర్వాత అమలు చేసిన కాంక్రీట్ విధానాలకు రెట్టింపు ప్రాధాన్యత ఇవ్వడం గురించి ఆయన పేర్కొన్నారు.

US బ్యాంకుల కంటే చాలా ఎక్కువ రాబడిని ఇవ్వగలగడం వల్ల NRIలు తమ డబ్బును భారతీయ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సుబ్రమణియన్ కోరారు. అమెరికాలో కంటే భారత్‌లో జీతాల పెంపు చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. 2047లో దేశం స్వాతంత్ర్యం పొంది 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లను సులభంగా తాకగలదని సుబ్రమణియన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక సంస్థల డేటాను ఉటంకిస్తూ, రాబోయే కాలంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సుబ్రమణ్యం అన్నారు.

 మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..