
ఈ రోజుల్లో బ్యాంకు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కావాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉందనేదే కీలకం. సాధారణంగా 750 కంటే ఎక్కువ ఉంటే మంచి స్కోరుగా పరిగణిస్తారు. కానీ చాలామందికి స్కోరు 650-660 మధ్యలో ఆగిపోతుంటుంది. ముఖ్యంగా 650 వంటి స్కోరు ఉంటే అది మోడరేట్ రిస్క్ కేటగిరీలోకి వస్తుంది. దీనివల్ల లోన్లు రావడం కష్టమవ్వడమే కాకుండా వచ్చినా ఎక్కువ వడ్డీ రేట్లు పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్కోరును సులభంగా 700 దాటించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
650 స్కోరు మరీ ప్రమాదకరం కాకపోయినా గొప్ప స్కోరు మాత్రం కాదు. ఈ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు వెంటనే లోన్లు ఇవ్వడానికి వెనుకాడుతాయి.
దీనిపై క్రెడ్జెనిక్స్ వ్యవస్థాపకుడు రిషబ్ గోయెల్ మాట్లాడుతూ.. “650 స్కోరు అనేది ఒక మోస్తరు రిస్క్‌ను సూచిస్తుంది. కానీ సరైన ఆర్థిక క్రమశిక్షణతో దీనిని సరిదిద్దుకోవచ్చు. ముఖ్యంగా లోన్ల తిరిగి చెల్లింపులు సకాలంలో చేయడం, క్రెడిట్ వినియోగాన్ని 30శాతం లోపు ఉంచుకోవడం, కొత్త అప్పుల కోసం ఆత్రుత పడకపోవడం వంటివి చేస్తే స్కోరు వేగంగా మెరుగుపడుతుందని సూచించారు.
మీ స్కోర్ 650 నుండి 750+ కి వెళ్లాలంటే ఈ కింద సూచనలు పాటించండి:
మీరు తీసుకున్న లోన్ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను ఒక్క రోజు ఆలస్యం చేసినా స్కోరు దెబ్బతింటుంది. 30 రోజుల ఆలస్యం కూడా భారీ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆటో పే పెట్టుకోవడం ఉత్తమం.
మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లక్ష రూపాయలు ఉంటే అందులో 30 వేల రూపాయలకు మించి వాడకూడదు. ఎక్కువ లిమిట్ వాడేస్తుంటే, మీరు అప్పుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు భావిస్తాయి. అనవసరమైన విలాసాలకు కార్డును వాడకండి.
తక్కువ సమయంలోనే ఎక్కువ లోన్ల కోసం లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయకండి. ఇలా చేస్తే మీ సిబిల్ రిపోర్ట్‌లో హార్డ్ ఎంక్వైరీస్ పెరుగుతాయి. ఇది మీ స్కోరును తాత్కాలికంగా తగ్గిస్తుంది.
ప్రతి మూడు నెలలకోసారి మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మీరు తీర్చేసిన లోన్లు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తప్పుగా చూపించవచ్చు. అలాంటి తప్పులు ఉంటే వెంటనే సంబంధిత బ్యూరోకి ఫిర్యాదు చేసి సరిచేయించుకోండి.
మీకు పాత క్రెడిట్ కార్డులు లేదా లోన్లు ఉంటే వాటిని సక్రమంగా మెయింటైన్ చేయండి. దీర్ఘకాలిక క్రెడిట్ హిస్టరీ ఉంటే స్కోరు పెరగడానికి అవకాశం ఎక్కువ. ఆర్థిక క్రమశిక్షణ ఉంటే 657 స్కోరును కొన్ని నెలల్లోనే మంచి స్థాయికి తీసుకురావచ్చు. దీనివల్ల భవిష్యత్తులో తక్కువ వడ్డీకే లోన్లు పొందే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి