
త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జీతం తీసుకునే ఉద్యోగులు, పన్ను చెల్లించేవారికి పలు మినహాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా జీతం తీసుకునేవారికి హౌస్ రెంట్ అలవెన్స్(HRA)లో పన్ను మినహాయింపులకు మరింత ఛాన్స్ ఉంది. హెచ్ఆర్‌ఏ క్లెయిమ్ చేసుకునేవారికి మరిన్ని మినహాయింపులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో జీతం తీసుకునేవారికి ఊరట లభించనుంది

హెచ్ఆర్ఏ అనేది కంపెనీ నుంచి ఉద్యోగి తీసుకునే హౌస్ రెంట్ అలవెన్స్. మీ జీతం కంటే అద్దె ఎక్కువ చెల్లిస్తున్నా.. లేదా మీరు మెట్రో లేదా నాన్ మెట్రో నగరాల్లో నివసిస్తున్నా హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపుల్లో రానున్న బడ్జెట్‌లో మార్పులు చోటుచేసుకోవచ్చు. పాత పన్ను విధానంలో హెచ్ఆర్ఏ మినహాయింపులు ఎక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఎక్కువమంది దానిని ఎంచుకుంటున్నారు.

ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, పూణె, గురుగ్రాయ్, నోయిడా వంటి నగరాల్లో ముంబై, ఢిల్లీ కంటే ఎక్కువ అద్దెలు ఉన్నాయి. కానీ ఆ నగరాలను పన్ను నిబంధనల ప్రకారం నాన్ మెట్రో నగరాలుగా పరిగణిస్తున్నారు. దీంతో వీటిని మెట్రో నగరాల కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల ఈ నగరాల్లో నివసించే వారు 50 శాతం వరకు హెచ్‌ఆర్ఏ పన్ను మినహాయింపు పొందేందుకు వీలవుతుంది.

ఇక ఏప్రిల్ 2026 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి రానుంది. ఇందులో హెచ్‌ఆర్‌ఏ పరిమితిని ఇండెక్స్‌తో లింక్ చేయాలని కోరుతున్నారు. దీని వల్ల ద్రవ్యోల్బణం ఆధారంగా హెచ్‌ఆర్ఏలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక చాలామంది తల్లిదండ్రులు, తాతామామలకు అద్దె చెల్లించడం ద్వారా హెచ్‌ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పటివరకు ఉన్న చట్టాలు దీనికి అనుకూలంగా ఉన్నాయి.

ఇలాంటి సమయాల్లో హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసినప్పుడు అది నిజమా..? లేదా..? అనేది పరిశీలించేందుకు అధికారులు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో అద్దె ఒప్పందం పత్రం రాసుకోవడం, బ్యాంక్ ద్వారా అద్దె చెల్లించడం, ఇంటి యజమాని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో దీనిని పొందుపర్చేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో మారుతున్న కాలానుగుణంగా హెచ్‌ఆర్ఏ నియమాలను మార్చాలనే డిమాండ్లు వస్తున్నాయి.