
ఈ ఆధునిక కాలంలో అత్యవసర ఖర్చులకైనా, వ్యక్తిగత అవసరాలకైనా అందరికీ టక్కున గుర్తొచ్చేది లోన్. చాలా మంది ఏదో ఒక అవసరానికి లోన్స్ తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో లోన్స్ తీసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. అయితే పర్సనల్ లోన్ అనగానే కచ్చితంగా ఎక్కువ జీతం ఉండాలని, పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయాలని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా నెలకు రూ.15,000 మాత్రమే ఆదాయం ఉన్నవారికి బ్యాంకులు అసలు లోన్ ఇస్తాయా? లేదా? అనే సందేహం ఎప్పుడూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ ఆదాయం ఉన్నవారు రుణం ఎలా పొందవచ్చో, నిపుణులు చెబుతున్న ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్ . అంటే, బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేదా పూచీకత్తు లేకుండా కేవలం నమ్మకంపై ఇచ్చే రుణం. అందుకే బ్యాంకులు అప్పు ఇచ్చే ముందు దరఖాస్తుదారుడి ఆదాయాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తాయి. కొన్ని బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం రూ. 20,000, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రూ. 25,000 కనీస నికర జీతం ఉండాలని నిబంధనలు విధిస్తున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రైవేట్ బ్యాంకులు సాధారణంగా రూ.25,000 కంటే తక్కువ జీతం ఉన్నవారికి లోన్ ఇవ్వడానికి వెనుకాడుతుంటాయి. మెట్రో నగరాల్లో ఈ పరిమితి ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇందుకు పెద్ద బ్యాంకుల కంటే ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బజాజ్ ఫిన్‌సర్వ్, మనీ వ్యూ, క్రెడిట్ బీ, క్యాషే వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తక్కువ ఆదాయ వర్గాల వారికి అండగా నిలుస్తున్నాయి. ఇవి రూ.10,000 నుండి రూ. 15,000 జీతం ఉన్నవారికి కూడా వారి అర్హతను బట్టి చిన్న మొత్తంలో త్వరగా లోన్స్ మంజూరు చేస్తున్నాయి.
మీ జీతం తక్కువగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడేది మీ సిబిల్ స్కోర్ మాత్రమే. మీ క్రెడిట్ హిస్టరీ బాగుండి, స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే తక్కువ జీతం ఉన్నప్పటికీ కంపెనీలు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. గతంలో తీసుకున్న లోన్లు లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐలను సకాలంలో చెల్లించడం వల్ల ఈ స్కోర్ పెరుగుతుంది.
రూ.15,000 జీతం ఉన్నప్పుడు మీ ఫిక్స్‌డ్ అబ్లిగేషన్ ఆదాయ నిష్పత్తి ఆధారంగా లోన్ అమౌంట్ డిసైడ్ అవుతుంది. అంటే మీ జీతంలో ఈఎంఐ చెల్లించే సామర్థ్యం రూ.3,000 నుండి రూ. 5,000 మాత్రమే ఉంటుంది కాబట్టి మీకు లభించే రుణ మొత్తం రూ. 25,000 నుండి రూ. 50,000 వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
తక్కువ జీతం ఉన్నవారికి లోన్ ఇచ్చేటప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి NBFCలు, ఫైనాన్స్ యాప్‌లు వడ్డీ రేట్లను చాలా ఎక్కువగా విధిస్తాయి. అలాగే ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఇలాంటి రుణాలు తీసుకోకపోవడమే మంచిది.