
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో త్వరలో వడ్డీ జమ కానుంది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సిద్దమవుతోంది. ఇప్పటికే 8.25 శాతం వడ్డీ చెల్లించేందుకు కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో భవిష్య నిధి సంస్ధ ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. మార్చిలో వడ్డీ రేట్లను ఖరారు చేసింది. వరుసగా మూడో ఏడాది కూడా 8.25 శాతంగా నిర్ణయించింది. మీ పీఎఫ్ అకౌంట్లో జమ అయ్యే లేదా ప్రస్తుతం ఉన్న నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ అందిస్తారు. కానీ ఆర్ధిక సంవత్సరం చివరిలోనే వడ్డీని నిర్ణయించి ఒకేసారి అకౌంట్లో జమ చేస్తారు. వడ్డీ రేటును ఫిక్స్ చేసి మూడు నెలలు గడుస్తున్నా.. ఇంకా అకౌంట్లో పడలేదు. దీంతో ఈ నిధుల కోసం చందాదారులు ఎదురుచూస్తున్నారు.
ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టి ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీని జమ చేయనున్నట్లు ఈపీఎఫ్‌వో ఇప్పటికే ప్రకటించింది. జులైలోగా అందరి అకౌంట్లలో వేయాలని చూస్తోంది. అయితే ఈ వడ్డీ పడిందా.. లేదా అనేది పీఎఫ్ ఖాతాదారులు సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. యూఏఎన్ పోర్టల్‌లోకి వెళ్లి పాస్ బుక్ ఆప్షన్ ఎంచుకుని యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా పీఎఫ్ వడ్డీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా పొందే వీలుంది. ఇదే కాకుండా జస్ట్ ఒక్క మిస్డ్ కాల్ ద్వారా కూడా సెకన్లలోనే పీఎఫ్ బ్యాలెన్స్ పొందటం ద్వారా వడ్డీ జమ అయిందా.. లేదా అనేది తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఒకసారి చూద్దాం.
EPFOHO (మీ యూఏఎన్ నెంబర్) లాంగ్వేజ్ టైప్ చేసి 7738299899 నంబర్‌కు మెసేజ్ చేయాలి. ఉదాహరణకు EPFOHO యూఏఎన్ నెంబర్ ENG అని టైప్ చేసి మెస్సే్జ్ పంపాలి. మీ బ్యాలెన్స్ వివరాలు సెకన్లలోనే మీకు టెక్ట్స్ రూపంలో వచ్చేస్తాయి. దీని ద్వారా వడ్డీ వచ్చిందా.. లేదా అనేది తెలుసుకోవచ్చు
ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. 2-3 రింగ్స్ అయిన వెంటనే కాల్ కట్ అవుతుంది. అనంతరం మీ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు SMS రూపంలో అందుతాయి. ఈ రెండు విధానాల ద్వారా మీరు సులభంగా పీఎఫ్ బ్యాలెన్స్ చేెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో డిజిటల్ సౌకర్యాలు మెరుగుపరుస్తోంది.