సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? సింపుల్‌ ట్రిక్స్‌ ఇవే!

వంట గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ ఎంత మిగిలి ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గ్యాస్ ఉన్న పద్ధతులు తెలియక చాలాసార్లు ఇబ్బంది పడతాం. తడి గుడ్డ పరీక్ష, సిలిండర్ బరువును గమనించడం, మంట రంగును బట్టి గ్యాస్ స్థాయిని సులభంగా గుర్తించవచ్చు.

సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? సింపుల్‌ ట్రిక్స్‌ ఇవే!
Lpg Cylinder

Updated on: Mar 16, 2026 | 7:30 AM

ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ వాడుతున్నప్పుడు అందులో గ్యాస్ ఎంత మిగిలి ఉందో చాలా మందికి తెలియదు. చాలాసార్లు వంట చేస్తున్న సమయంలోనే గ్యాస్ అయిపోవడం ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తుంది. అయితే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో ముందుగానే తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిలిండర్‌లో గ్యాస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించే పద్ధతి తడి గుడ్డ పరీక్ష. ముందుగా ఒక తడి గుడ్డను తీసుకుని సిలిండర్ బయట భాగం మొత్తం తుడవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత సిలిండర్‌ను గమనిస్తే, పైభాగం త్వరగా ఎండిపోతుంది. అయితే గ్యాస్ ఉన్న భాగం చల్లగా ఉండటం వల్ల అక్కడ తడి కొంతసేపు అలాగే ఉంటుంది. తడి కనిపించే స్థాయి వరకు సిలిండర్‌లో గ్యాస్ మిగిలి ఉందని అర్థం చేసుకోవచ్చు.

మరో సులభమైన పద్ధతి సిలిండర్ బరువును గమనించడం. గ్యాస్ సిలిండర్‌పై సాధారణంగా ఖాళీ సిలిండర్ బరువు (టేర్ వెయిట్) ముద్రించి ఉంటుంది. గ్యాస్ నింపిన తర్వాత మొత్తం బరువు దాదాపు 29 నుంచి 30 కిలోల వరకు ఉంటుంది. సిలిండర్ తేలికగా అనిపిస్తే గ్యాస్ తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అలాగే వంట సమయంలో మంట బలహీనంగా కనిపించడం కూడా గ్యాస్ తగ్గిపోతున్న సంకేతంగా భావించవచ్చు. మంట నీలం రంగులో ఉండాలి. అది పసుపు రంగులోకి మారితే లేదా సరిగ్గా వెలగకపోతే గ్యాస్ స్థాయి తగ్గినట్టు సూచిస్తుంది.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ గ్యాస్ మీటర్లు లేదా వెయిట్ స్టాండ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి సిలిండర్ బరువును కొలిచి గ్యాస్ ఎంత మిగిలి ఉందో చూపిస్తాయి. నిపుణుల ప్రకారం గ్యాస్ పూర్తిగా అయిపోయే వరకు వేచి ఉండకుండా ముందుగానే సిలిండర్ బుక్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వంట మధ్యలో ఇబ్బంది పడకుండా ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us