Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బులు ఉంచుకోవచ్చు..? ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందులే..

బ్యాంక్ అకౌంట్లలో అనేక కేటగిరీలు ఉన్నాయి. ఒక్కొ అవసరానికి ఒక్కొ అకౌంట్ ఉంటుంది. వ్యాపార అవసరాల కోసం కరెంట్ అకౌంట్, పెట్టుబడుల కోసం డీమ్యాట్ అకౌంట్ లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే రోజువారీ ఖర్చులను నిర్వహించుకునేందుకు సేవింగ్స్ అకౌంట్ ఉపయోగపడుతూ ఉంటుంది.

Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బులు ఉంచుకోవచ్చు..? ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందులే..
Savings Account

Updated on: Jun 27, 2026 | 12:11 PM

ప్రతీఒక్కరికి తప్పనిసరిగా సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుంది. రోజువారీ ఖర్చులకు డబ్బులు ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. సేవింగ్స్ అకౌంట్లోని డబ్బులపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఈ వెసులుబాటు వల్ల పొదుపు ఖాతా ప్రతీఒక్కరూ ఉపయోగిస్తుంటారు. అయితే సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు డబ్బులు ఉంచుకోవచ్చు..? ఎక్కువ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు వస్తాయా? ఈ అకౌంట్లోని బ్యాలెన్స్‌పై వచ్చే వడ్డీపై ట్యాక్స్ ఉంటుందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు ఉంచుకోవచ్చు..?

ఈ ఖాతాలో ఎంత డబ్బు ఉంచుకోవచ్చనే దానిపై ఆదాయపు పన్ను చట్టాల కింద ఎటువంటి పరిమితి అనేది లేదు. మీరు ఎంత అయినా ఉంచుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఎలాంటి పన్ను వర్తించదు. అయితే తరచుగా లేదా అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో ఒకేసారి నగదు జమ చేయడం వల్ల సమస్యలు రావొచ్చు. బ్యాంకులు కొన్ని అధిక విలువ గల లావాదేవీలను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు పంపుతుంది. ఒకవేళ మీరు ప్రకటించిన ఆదాయానికి, అకౌంట్లో జమ అయ్యే నగదు మధ్య పొంతన లేకపోతే ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని వివరణ అడగవచ్చు. ఇలాంటి సమయంలో మీకు ఆ సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందనేది ఆధారాలతో సహా చూపించాల్సి ఉంటుంది. దీంతో మీకు వచ్చే నగదుకు సంబంధించిన ప్రూఫ్స్‌ను భద్రపర్చుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. జీతం, వ్యాపార సంపాదన, పెట్టుబడులు, బహుమతులు లేదా ఆస్తి అమ్మకాలు వంటి వాటిని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో సరిగ్గా నమోదు చేయాలి. దీని వల్ల మీకు వచ్చే నగదు చట్టబద్ధమైనది, పత్రాలతో కూడినది అయితే ఎటువంటి సమస్య ఉండదు.

వడ్డీపై పన్ను ఉంటుందా..?

సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకునే డబ్బుపై బ్యాంకులు వడ్డీ అందిస్తూ ఉంటాయి. బ్యాంకును బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. అయితే సేవింగ్స్ అకౌంట్లోని డబ్బులపై పన్ను ఉండదు. అయితే  వడ్డీపై మాత్రం పన్ను విధిస్తారు. సెక్షన్ 80TTA కింద నిర్దేశిత పరిమితి వరకు పొదుపు ఖాతా వడ్డీలో ఖాతాదారులు మినహాయింపు పొందే అవకాశముంది. సీనియర్ సిటిజన్లుసెక్షన్ 80TTB కింద ట్యాక్స్‌లో మినహాయింపులు పొందవచ్చు. వారసత్వం, ఆస్తి అమ్మకం, బీమా మెచ్యూరిటీ, బహుమతులు ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి సరైన రికార్డులను నిర్వహించడం ముఖ్యం. ఈ పత్రాలు నిధుల చట్టబద్ధతను నిరూపించడానికి సహాయపడతాయి. అలాగే పన్ను అధికారుల నుండి వచ్చే ఏవైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానిక అవసరమవుతాయి.

Follow Us