మీ భార్య వైపే ఎంతసేపు అని చూస్తారు.? వారానికి 90 గంటలు పని చేయాలి..

|

Jan 10, 2025 | 6:27 AM

ఇంటి కంటే ఆఫీసే పదిలం అని పని చేసేవారు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. వాళ్లకు ఎప్పుడూ ఇంటి ధ్యాసే పట్టదు. ఆఫీసే లోకంగా ఉంటుంది. ఇక అలాంటి వారి కోసం ప్రత్యేకంగా సెలవులు కేటాయించాయి కొన్ని సంస్థలు. అలాగే మరికొన్ని..

మీ భార్య వైపే ఎంతసేపు అని చూస్తారు.? వారానికి 90 గంటలు పని చేయాలి..
L&t Chairman
Follow us on

కొందరు ఆఫీసే లోకం అన్నట్టుగా ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతుంటారు. ఇంటికోసం చాల తక్కువ సమయం కేటాయిస్తారు. తద్వారా ఇంట్లో సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అలాంటి వారికి కొన్ని సంస్థలు ప్రత్యేక సెలవులు ఇచ్చి కుటుంబంతో గడపాలని ప్రోత్సహిస్తుంటారు. తద్వారా మరింత క్వాలిటీగా వర్క్‌ చేయగలుగుతారని వారి అభిప్రాయం. అయితే ఇటీవల ఇన్‌ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇందుకు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు తెరలేపాయి. దేశం అభివృద్ధి చెందాలంటే 70 గంటలు పనిచేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఎల్‌ అండ్‌టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈయన కుటుంబానికి తక్కువ సమయం కేటాయించి, ఆఫీసుకే ఎక్కువసమయం ఇవ్వాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అంతేకాదు, ఆదివారాలు కూడా పనిచేయాలని ఆయన ఉద్యోగులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన ‘‘ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. వారానికి 90 గంటలు పనిచేయాలి. అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలి. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను’’ అంటూ వారితో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. భార్య ప్రస్తావన తీసుకువస్తూ ఆయన మాట్లాడిన మాటలను కొందరు తీవ్రంగా విమర్శించారు.

గతంలో నారాయణమూర్తి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి