హోటల్స్‌లో టవల్స్‌ ఎలా అంత తెల్లగా క్లీన్‌గా ఉంటాయి? దాని వెనకున్న సీక్రెట్‌ ఇదే

హోటల్ టవల్స్ మెత్తగా, తెల్లగా ఉండటానికి ప్రత్యేక లాండ్రీ విధానాలే కారణం. టవల్స్‌ను ముందుగా బ్లీచ్/వెనిగర్ ద్రావణాల్లో నానబెట్టి, తర్వాత శక్తివంతమైన డిటర్జెంట్‌లతో వేడి నీటిలో ఉతుకుతారు. భారీ వాషింగ్ మెషీన్‌లు, మోస్తరు డ్రైయింగ్, టవల్ రొటేషన్ కీలక పాత్ర పోషిస్తాయి.

హోటల్స్‌లో టవల్స్‌ ఎలా అంత తెల్లగా క్లీన్‌గా ఉంటాయి? దాని వెనకున్న సీక్రెట్‌ ఇదే
Hotel Towel

Updated on: May 12, 2026 | 11:42 AM

హోటల్‌లో బస చేసినప్పుడు అక్కడి తెల్లటి, మెత్తటి టవల్స్ చాలామందిని ఆకట్టుకుంటాయి. ఎన్నిసార్లు ఉతికినా అవి ఎలా అంత మెరుస్తూ, మృదువుగా ఉంటాయనే డౌట్‌ చాలా మందికి ఉంటుంది. అయితే దీనికి కారణం హోటళ్లు పాటించే ప్రత్యేక లాండ్రీ విధానాలేనని నిపుణులు చెబుతున్నారు. టవల్స్‌ను నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేయకుండా, ముందుగా ప్రత్యేక ద్రావణాల్లో నానబెట్టడం హోటళ్ల ప్రధాన రహస్యంగా భావిస్తున్నారు. సాధారణంగా వేడి నీటిలో ఆక్సిజన్ బ్లీచ్ లేదా తెల్ల వెనిగర్ కలిపి టవల్స్‌ను నానబెడతారు. ఇలా చేయడం వల్ల నూనె, మరకలు, దుర్వాసనలు తొలగిపోతాయి. ఆ తర్వాత శక్తివంతమైన పౌడర్ డిటర్జెంట్లతో వేడి నీటిలో ఉతకడం ద్వారా టవల్స్ మరింత శుభ్రంగా, క్రిమిరహితంగా మారుతాయి.

హోటళ్లలో ఉపయోగించే భారీ పారిశ్రామిక వాషింగ్ మెషీన్లు కూడా టవల్స్ నాణ్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మెషీన్లను ఓవర్‌లోడ్ చేయకుండా వాడటం వల్ల ప్రతి టవల్ సమానంగా శుభ్రపడుతుంది. అనంతరం ప్రత్యేక డ్రైయర్లలో మోస్తరు ఉష్ణోగ్రత వద్ద ఆరబెట్టడం ద్వారా టవల్స్ మృదుత్వాన్ని కోల్పోకుండా చూస్తారు. ఇక హోటళ్లలో టవల్స్‌ను మారుస్తూ వాడే విధానం కూడా వాటి నాణ్యతను నిలబెడుతుంది. ఒక్కో గదికి మూడు నుంచి నాలుగు సెట్ల టవల్స్ నిల్వ ఉంచడం వల్ల ఏ ఒక్క టవల్ కూడా అతిగా వాడబడదు. చిరిగినవి, మరకలు పడినవి లేదా రంగు తగ్గినవి వెంటనే తొలగిస్తారు.

హోటళ్లు సాధారణ మార్కెట్ టవల్స్‌కు బదులుగా వాణిజ్య-శ్రేణి టవల్స్‌ను కొనుగోలు చేస్తాయి. ఇవి ఎక్కువకాలం మన్నేలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముఖ్యంగా కోమ్డ్ కాటన్, ఈజిప్షియన్ కాటన్ వంటి అధిక నాణ్యత గల పదార్థాలతో తయారైన టవల్స్ ఎక్కువ మృదుత్వం, బరువు, నీరు పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా ప్రత్యేక లాండ్రీ పద్ధతులు, అధిక నాణ్యత గల టవల్స్, సరైన నిర్వహణ కలిసి హోటల్ టవల్స్‌ను ఎప్పటికీ కొత్తవిగా, మెత్తగా కనిపించేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us