
బీమా అనేది మనం ప్రాణాలతో లేనప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ బీమా తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. టర్మ్ ప్లాన్ (బేస్ కవర్) కలిగి ఉండటమే కాకుండా మీ జీవిత బీమాను మరింత సమగ్రంగా చేయడానికి మీరు అదనపు కవరేజీను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా బీమాను ఎంచుకునే ముందు ఖర్చుతో పాటు ప్రయోజన విశ్లేషణ అవసరం. అయితే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ (ఏడీబీ) పాలసీ తక్కువ ధరకే అదనపు ప్రయోజనాలు అందించే మంచి పాలసీ. అలాగే ఈ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం సులభం. దీనికి ఎటువంటి విస్తృతమైన పత్రాలు లేదా ఫార్మాలిటీలు అవసరం లేదు. మీరు దరఖాస్తు ఫారమ్‌ను పూరిస్తే సరిపోతుంది. ముఖ్యంగా పాలసీదారుడి ఆరోగ్య స్థితిని ఈ పాలసీలో పరిగణలోకి తీసుకోరు. ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్‌లు ఇచ్చే కంపెనీలు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణించినా లేదా ఆ సమయంలో వైకల్యం సంభవించినా పూర్తిగా కవరేజిని సొమ్మును చెల్లిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం విడివిడిగా అందిస్తున్నాయి. అయితే నిపుణులు మాత్రం ప్రమాదంలో వైకల్యం సంభవించినా పూర్తి కవరేజీ సొమ్మును తీసుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
ముఖ్యంగా కొన్ని టర్మ్ ప్లాన్స్ యాక్సిడెంటల్ డెత్ బెన్‌ఫిట్ కింద ఎక్కువ సొమ్మును అందిస్తాయి. అంటే పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే పాలసీదారు నామినీకి అదనపు పే-అవుట్ (బేస్ ప్లాన్ కింద హామీ మొత్తంతో పాటు) అందజేస్తుంది. ప్రమాదం వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల మరణం సంభవిస్తే బీమా సంస్థ బేస్ ప్లాన్ కింద హామీ ఇచ్చిన మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంది. అంటే మీరు రూ. 1 కోటి బేస్ కవర్ కింద ప్లాన్ తీసుకుంటే ఇంకో రూ. 1 కోటి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రూపంలో పాలసీదారులకు అందుతుంది.
మార్కెట్‌లో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, మ్యాక్స్ లైఫ్, టాటా ఏఐఏ, బజాజ్ అలయన్స్ కంపెనీలు అదనపు కవర్ ఉన్న పాలసీలను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. సాధారణ టెర్మ్ ప్లాన్‌కు అదనంగా కొంత చెల్లిస్తే వేరే పాలసీ అవసరం లేకుండానే మనం తీసుకున్న టెర్మ్ ప్లాన్ పాలసీకే యాక్సిడెంటల్ కవర్‌ను అందిస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ కంపెనీల్లో ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు జాగ్రత్తగా వ్యవహరించి అదనపు ప్రయోజనాలు పొందాలని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి