
ఆడ బిడ్డ అంటే భారం కాదు.. వరం అని భావించేలా తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసానిస్తోంది. వివిధ పథకాల ద్వారా వారికి ప్రోత్సాహాన్నిస్తోంది. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. అందులో ప్రధానమైన, ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకంలో ప్రతి నెలా కొంత మొత్తం పెట్టుబడి పెట్టుకొని పిల్లలు పెద్దవారైన తర్వాత వారి ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఈ పథకంలో ఆడపిల్ల పుట్టిన మొదటి రోజు నుంచి ఆ బిడ్డకు పదేళ్లు వచ్చే లోపు పథకాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిపాజిట్ చేయవచ్చు. దీనిలో 15 ఏళ్ల వరకూ కంటిన్యూగా మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే మరో ఆరేళ్లు ఈ పథకానికి లాకిన్ పీరియడ్ ఉంటుంది. మొత్తంగా మీ పాపకు 21 ఏళ్లు వచ్చేసరికి ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజనపై వార్షిక వడ్డీ 8 శాతం అందిస్తున్నారు. ఇప్పుడు నెలకు రూ. 5,000 ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 26లక్షలు ఎలా సంపాదించవచ్చే తెలుసుకుందాం రండి..
సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడ బిడ్డలకు గొప్ప వరం లాంటింది. ఈ పథకంలో కనీసం నెలకు రూ. 5,000 పెట్టుబడి పెట్టగలిగితే.. మీ బిడ్డ పెద్దయ్యాక ప్రతి అవసరం దాని నుంచి తీరిపోతుంది. ఉన్నత చదువులు, పెళ్లికి కూడా ఇబ్బంది లేకుండా దాని నుంచి వచ్చే సొమ్ము సరిపోతుంది.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో నెలవారీ మీరు రూ. 5,000 పెట్టుబడిపెడితే, మీ వార్షిక పెట్టుబడి రూ. 60,000 అవుతుంది. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.9,00,000 పెట్టుబడి పెడతారు. మీరు 15 నుంచి 21 సంవత్సరాల మధ్య ఎటువంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు, కానీ మీ మొత్తంపై 8 శాతం చొప్పున వడ్డీ జోడించడం కొనసాగుతుంది. మీరు సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ ప్రకారం లెక్కించినట్లయితే, మీ మొత్తం పెట్టుబడి రూ. 9 లక్షలపై మీకు రూ. 17,93,814 వడ్డీ లభిస్తుంది, ఇది మీ మొత్తం పెట్టుబడికి దాదాపు రెట్టింపు అవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మెచ్యూరిటీపై మొత్తం రూ. 26,93,814 అంటే సుమారు రూ. 27 లక్షలు పొందుతారు. మీరు ఈ పెట్టుబడిని 2023 సంవత్సరంలో ప్రారంభిస్తే, మీరు 2044లో మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు. మీరు మీ కుమార్తె చదువులు లేదా వివాహం మొదలైన వాటి అవసరాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు.
సుకన్య సమృద్ధి యోజనపై త్రైమాసిక ప్రాతిపదికన సమీక్ష చేస్తారు. ఇందులో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. మీరు గరిష్టంగా రూ. 1.50 లక్షలపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ పథకం కింద, మీరు ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఖాతాలను తెరవగలరు. మీకు ఇద్దరు కంటే ఎక్కువ మంది కుమార్తెలు ఉంటే, మీరు మూడవ లేదా నాల్గవ కుమార్తె కోసం ఈ పథకం యొక్క ప్రయోజనం పొందలేరు. అయితే, మీ రెండో అమ్మాయి, కవలలు అయితే ఆమె కోసం సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..