
ఆర్థిక భద్రత, భవిష్యత్తు అవసరాల కోసం మనం వివిధ పథకాలలో పెట్టుబడులు పెడుతుంటాం. అవి కాలక్రమీణా పెద్ధ మొత్తంగా మారి మనకు చాలా ఉపయోగపడుతుంటాయి. ఇలాంటి పథకాలకు అనేక ప్రోత్సాహకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను నుంచి మినహాయింపులు వర్తిస్తాయి. వీటిలో పొదుపు చేయడం ద్వారా డబ్బుకు భద్రతతో పాటు పన్ను తగ్గింపులతో అదనపు లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి ఎన్ పీఎస్ పథకంతో పాటు పన్ను తగ్గింపులకు ఉపయోగపడే వివిధ మార్గాలను తెలుసుకుందాం.
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) అనేది దీర్ఘకాల పదవీ విరమణ పథకం. దీని ద్వారా మీకు మంచి ఆదాయం లభించడంతో పాటు ఆదాయపు పన్నులపై డబ్బును ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ), కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఎన్ పీఎస్ అనే దీర్ఘకాలిక పదవీ విరమణ పథకాన్ని అభివృద్ధి చేశాయి. సైనిక దళాలలో ఉన్నవారికి మినహా ప్రభుత్వ, ప్రైవేట్, అసంఘటిత రంగాలలోని ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఎన్ పీఎస్ విరాళాలతో మీకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మరిన్ని ఉపయోగాలు పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా మీ పన్ను చెల్లింపులు సున్నాకు చేరుకుంటాయి. అంటే వందశాతం మినహాయింపు లభిస్తుంది. ఉదాహరణకు మీ స్థూల జీతం ఏడాదికి రూ.పది లక్షలు అయితే, ఎన్ పీఎస్ చెల్లింపులతో పాటు, వివిధ మార్గాలు మీ పన్నును సున్నాకి తగ్గిస్తాయి. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.
ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ ఆర్ఏ) మినహాయింపు.. సెక్షన్ 10 (13ఏ) ప్రకారం హెచ్ ఆర్ఏను ఈ కింది విధంగా నిర్ణయిస్తాయి. మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ మూల వేతనంలో 50 శాతం, నాన్ మెట్రో ఉద్యోగులు 40 శాతం పొందుతున్నారు. మీ వార్షిక వేతనం రూ. 10 లక్షలు అయితే దాదాపు రూ.లక్షను హెచ్‌ఆర్‌ఏగా క్లెయిమ్ చేయవచ్చు. అలాగే మీ వేతనంలో రూ.2 లక్షలకు ఎన్ పీఎస్ మినహాయింపు ఉంటుంది. మిగిలిన రూ.7 లక్షలు పన్ను పరిధిలోకి వస్తుంది.
వినోదం, రవాణా, టెలిఫోన్ ఖర్చులు.. మీరు వినోదం, రవాణా, టెలిఫోన్, స్టేషనరీ ఖర్చుల కోసం రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లలో అదనంగా రూ. 1.25 లక్షలను తీసివేయవచ్చు. మీ కంపెనీ మానవ వనరుల విభాగంతో సంప్రదించిన తర్వాత, మీరు వీటిని మీ వేతనంలో చేర్చవచ్చు. చాలా కార్యాలయాలు ఈ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను నిర్వహించడానికి నిబంధనలను కలిగి ఉన్నాయి. ఈ మినహాయింపుతో మీ పన్ను చెల్లించే ఆదాయం రూ. 5,75,000కి తగ్గింది.
ఆరోగ్య బీమా ప్రీమియాలు.. సెక్షన్ 80 (డీ) ప్రకారం మీ ఆరోగ్య బీమా ప్రీమియాల నుంచి రూ. 25 వేలు (బీమా చేసిన వ్యక్తి సీనియర్ అయితే రూ. 50 వేలు) వరకూ తీసివేయడానికి అనుమతి ఉంటుంది. వ్యక్తులు, జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరి తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా ప్రీమియాలను క్లెయిమ్ చేసిన తర్వాత పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5,50,000గా మారింది.
సెక్షన్ 87A కింద పన్ను రాయితీ.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ. 12,500 రాయితీని క్లెయిమ్ చేయడానికి వీలు ఉంది. ఈ మినహాయింపుతో, మీరు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5,37,500కి తగ్గిపోయింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..