UPI Scam: రూ. 200 పంపి.. రూ. 20వేలు కాజేస్తున్నారు.. యూపీఐ వాడేవారు తస్మాత్ జాగ్రత్త..

|

Jun 10, 2024 | 4:34 PM

ఇటీవల కాలంలో యూపీఐ ఓవర్ పేమెంట్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా వినియోగదారులను చాలా సులభంగా బురిడి కొట్టిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు యూపీఐ ఓవర్ పేమెంట్ స్కామ్ అంటే ఏమిటి? ఎలా సంరక్షించుకోవాలి? తెలుసుకుందాం రండి..

UPI Scam: రూ. 200 పంపి.. రూ. 20వేలు కాజేస్తున్నారు.. యూపీఐ వాడేవారు తస్మాత్ జాగ్రత్త..
Upi Scam
Follow us on

మన దేశంలో బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ బాటలో శరవేగంగా ప్రయాణిస్తోంది. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ బాగా జనాల్లోకి వెళ్లింది. అయితే దీనిని ఆసరాగా చేసుకుంటున్నారు నేరగాళ్లు. మీరు కష్టపడి సంపాదించుకుంటున్న సొమ్మును వినూత్న మార్గాలలో కాజేస్తున్నారు. ఆ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక(2023-24 ఆర్థిక సంవత్సరం)లో పేర్కొంది. దీని ప్రకారం 2022-23లో 9,046 మోసాలతో పోలిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపు మోసాల సంఖ్య 36,075కి పెరిగింది. అయితే నష్టోపోయిన సొమ్ము మాత్రం రూ.45,358 కోట్ల నుంచి రూ.13,930 కోట్లకు తగ్గింది. అయితే ఇటీవల కాలంలో యూపీఐ ఓవర్ పేమెంట్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా వినియోగదారులను చాలా సులభంగా బురిడి కొట్టిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు యూపీఐ ఓవర్ పేమెంట్ స్కామ్ అంటే ఏమిటి? ఎలా సంరక్షించుకోవాలి? తెలుసుకుందాం రండి..

యూపీఐ ఓవర్ పేమెంట్ స్కామ్ అంటే ఏమిటి?

మీరు ఆఫీసులో ఏదో పని ఒత్తిడిలో ఉన్నారనుకోండి.. ఈ లోపు ఓ వ్యక్తి మీకు ఫోన్ చేసి తాను వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నానని, పొరపాటున మీ యూపీఐకి రూ. 20,000 పంపానని చెప్పారనుకోండి. ఆ సమయంలో మీరు పని ఒత్తిడిలో ఉంటారు. అవతలి వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీ అని అన్నాడు కాబట్టి మన మైండ్ ఈజీగా ఆ మాటలు నమ్మేస్తుంది. అందుకు బలం చేకూర్చేలా మీకు యూపీఐలో అమౌంట్ ట్రాన్స్ ఫర్ అయినట్లు మెసేజ్, అలర్ట్ కూడా వచ్చి ఉంటుంది. దీంతో అతను చెప్పిన మొత్తాన్ని రిటర్న్ చేస్తున్నామనుకొని అవతలి వ్యక్తి పేమెంట్ చేస్తారు. అవతలి వ్యక్తి మీకు ధన్యవాదాలు చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇక్కడ మోసం ఏమిటి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. మీ యూపీఐ అకౌంట్ కు నగదు జమైంది నిజం.. మీకు కాలర్ ఫోన్ చేసింది నిజం.. మీరు తిరిగి ఆ డబ్బులు చెల్లించింది నిజమే.. కానీ వారు మీకు పంపిన మొత్తం రూ. 200 మాత్రమే ఉంటుంది. కానీ మీరు అతనికి తిరిగి పంపింది రూ. 20,000 అవుతుంది. అంటే మీకు వచ్చిన నోటిఫికేషన్ లేదా ఎస్ఎంఎస్ లో రూ. 200.00 అని ఉంటుంది. కానీ మీకు ఫోన్ చేసిన వ్యక్తి మీకు రూ. 20,000 అని చెప్పడంతో ఆ మెసేజ్ సరిగ్గా చూసుకోకుండా సులభంగా నగదు బదిలీ చేసేయడంతో మీరు నష్టపోతారు.

యూపీఐ ఓవర్‌పేమెంట్ స్కామ్‌ల నుంచి ఎలా రక్షించుకోవాలి?

మీ బ్యాంక్ ఖాతాలో ఏదైనా డబ్బు వచ్చినప్పుడు మీరు పొందే ఎస్ఎంఎస్ టెంప్లేట్ మొత్తంలో రెండు దశాంశ స్థానాల వరకు చూపుతుంది. మీరు కంగారులో ఉంటే, మీరు రూ. 200.00ని రూ. 20,000గా తప్పుగా చదవవచ్చు. అందుకే మీకు ఫోనణ్ చేసే స్కామ్ స్టర్లు మిమ్మల్ని తొందరపెడతారు. కంగారు పెట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయాన్ని ఇవ్వరు.
మరో ఉదాహరణ కావాలంటే రూ. 3200.00ని రూ. 320000గా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్ గా ఉండొచ్చు.

ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి: ఏదైనా యూపీఐ అభ్యర్థనను ఆమోదించే ముందు, దాన్ని ఎవరు పంపుతున్నారు. డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి అభ్యర్థనను ఎల్లప్పుడూ రెండుసార్లు తనిఖీ చేయండి. ఏదైనా ఊహించని చెల్లింపు అభ్యర్థనల పట్ల జాగ్రత్తగా ఉండండి.

పంపినవారి వివరాలను ధ్రువీకరించండి: మీరు తెలియని వారి నుంచి లేదా ఊహించని మొత్తం కోసం చెల్లింపు అభ్యర్థనను స్వీకరించినట్లయితే, కొనసాగే ముందు పంపినవారి వివరాలను కాల్ లేదా సందేశం ద్వారా ధ్రువీకరించండి.

ఆ సందేశాలతో జాగ్రత్త: స్కామర్‌లు తరచుగా తప్పుదారి పట్టించే లేదా తప్పుడు క్లెయిమ్‌లతో అయాచిత సందేశాలను పంపుతారు. పంపినవారి గుర్తింపు, లావాదేవీ ఉద్దేశాన్ని ధ్రువీకరించకుండా ఏ అభ్యర్థనలకు ప్రతిస్పందించవద్దు లేదా ఆమోదించవద్దు.

ఒత్తిడికి లోనవకండి: ఫోన్ కాల్‌ల ఆధారంగా, ముఖ్యంగా తెలియని నంబర్‌ల ఆధారంగా డబ్బు బదిలీలలో ఎప్పుడూ తొందరపడకండి. గుర్తుంచుకోండి, స్కామర్లు తమ బాధితులను దోపిడీ చేయడానికి తరచుగా అత్యవసర, భావోద్వేగ తారుమారుని ఉపయోగిస్తారు. అప్రమత్తంగా ఉండండి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..