HDFC Merger: దేశ కార్పొరేట్‌ చరిత్రలో మరో కీలక విలీనం.. ఒకటి కానున్న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

దేశ కార్పొరేట్‌ చరిత్రలో మరో కీలక విలీనం జరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌(HDFC Limited)ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank)లో విలీనం(HDFC Merger) చేయడానికి తమ బోర్డు ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది.

HDFC Merger: దేశ కార్పొరేట్‌ చరిత్రలో మరో కీలక విలీనం.. ఒకటి కానున్న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
Hdfc Bank

Updated on: Apr 04, 2022 | 11:27 AM

దేశ కార్పొరేట్‌ చరిత్రలో మరో కీలక విలీనం జరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌(HDFC Limited)ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank)లో విలీనం(HDFC Merger) చేయడానికి తమ బోర్డు ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలయిన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌లో విలీనం కానున్నాయి. దీనికి సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణా సంస్థల అనుమతి లభించాల్సి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మధ్య విలీనంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీలోని ప్రతి 25 షేర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లు ఇస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్‌ల యాజమాన్యంలో ఉంటుంది. ఈ విలీన ప్రక్రియ 2023-24 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ పరిణామం నేపథ్యంలో నేడు ఇరు సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. ఓ దశలో ఈ జంట షేర్లు 15 శాతం మేర లాభపడడం విశేషం. ఉదయం 9.30 గంటలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 7.50 శాతం పెరిగి రూ.1619.20 వద్ద మార్కెట్ విలువ రూ.8,97,933.99 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ 9.27 శాతం జంప్ చేసి రూ. 2678.20కి చేరుకుంది. మార్కెట్‌ విలువపరంగా విలీనానంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మూడో అతిపెద్ద సంస్థగా అవతరించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ 1 నాటికి ఇరు సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే విలీనానంతర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.12.8 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ50లో వెయిటేజీపరంగా చూసినా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అతిపెద్ద స్టాక్‌గా నిలవనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్చి 31 నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెయిటేజీ 8.4 శాతంగా.. హెచ్‌డీఎఫ్‌సీ వెయిటేజీ 5.66 శాతంగా ఉంది.

Read Also.. Stock Market: భారీ లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్‌ మార్కెట్లు.. భారీగా పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్ల ధర..