HDFC Loan: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర ఫైనాన్స్ సంస్థలు వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇక దేశీ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ భరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దారిలోనే హెచ్‌డీఎఫ్‌సీ కూడా నడుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా రుణ గ్రహీతలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ పండగ సీజన్ నేపథ్యంలో రుణ గ్రహీతలకు శుభవార్త వినిపించింది. రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రుణాలపై తగ్గించిన రేట్లు కేవలం హోమ్ లోన్స్ తీసుకున్నవారికే మాత్రమే వర్తించనుంది. దీంతో ఇప్పుడు రుణ గ్రహీతలు 6.7 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ పొందవచ్చు.
సెప్టెంబర్ 20 నుంచే ఈ వడ్డీ రేట్ల నిర్ణయం అమలులోకి వచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమేనని స్పష్టతనిచ్చింది. అయితే తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ పొందాలని భావించే వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారతాయని గమనించాలి.
కాగా, అక్టోబర్ 31, 2021 వరకు తక్కువ వడ్డీ రేటుకే అంటే 6.7 శాతం వడ్డీ రేటు ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇకపోతే ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.5 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ అందిస్తోంది. ఎస్‌బీఐ అయితే హోమ్ లోన్స్‌పై 6.7 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే 6.75 శాతం వడ్డీ పడుతుంది.
ఇలా పండగ సీజన్‌లో ఒక బ్యాంకు తర్వాత ఒకటి ఇలా వినియోగదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ ప్రకటనతో వినియోగదారులు తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. దీంతో వారికి ఎంతో ఊరట కలుగనుంది. ఇప్పటికే చాలా మంది హోమ్ లోన్స్, వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత రుణాలు తీసుకున్న వారి సంఖ్య పెరిగిపోయింది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గింపు ప్రకటన చేస్తున్నాయి.