Telugu News Business Have you applied for Ayushman card, Card issuance in seconds with these tips, Ayushman bharat details in telugu
Ayushman bharat: ఆయుష్మాన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? ఈ టిప్స్‌తో క్షణాల్లో కార్డు జారీ
సీనియర్ సిటిజన్ల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రణాళిక రూపొందించింది. దానిలో భాగంగా రూ.5 లక్షల హెల్త్ కవరేజీ ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ పథకంలో ఇప్పటికే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీ ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు దాటిన పెద్దలకు ప్రత్యేకంగా రూ.5 లక్షలు ప్రకటించింది.
ఈ సేవలు పొందటానికి సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందాల్సి ఉంటుంది. ఈ కింద తెలిపిన సులువైన పద్ధతుల ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. సాధారణంగా 70 ఏళ్లు నిండిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కొత్త పథకం ద్వారా వారందరూ కవరేజీ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చు. దాదాపు రూ.5 లక్షల విలువైన వైద్యం ఆయా ఆస్పత్రుల్లో అందజేస్తారు. ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు కోసం ఈ కింద తెలిపిన పద్ధతులలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొబైల్ యాప్
మొబైల్ యాప్ లేదా ఆన్ లైన్ పోర్టల్ ను ఉపయోగింగించి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
లబ్దిదారుడిగా లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.
ఆధార్ నంబరు, ఇతర వివరాలను పూర్తి చేయాలి.
పిన్ కోడ్, కుటుంబ సమాచారం, అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.
దీంతో మీరు దరఖాస్తు చేసుకోవడం పూర్తవుతుంది. దాన్ని ఆమోదించిన తర్వాత ఆయుష్మాన్ వయో వందన కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలి.
వెబ్ సైట్
ముందుగా బెనిఫిషరీ.ఎన్ హెచ్ఏ.ఇన్ వెబ్ సైట్ ను సంప్రదించాలి.
మొబైల్ నంబర్, క్యాప్చాను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
70 ఏళ్లు పైబడిన వారికోసం సీనియర్ సిటిజన్ ఎన్ రోల్ మెంట్ ఎంపికపై క్లిక్ చేయాలి.
ఆధార్ నంబరు, ఇతర వివరాలను నమోదు చేయాలి.
దరఖాస్తును సమర్పించిన తర్వాత ఆమోదం అనంతరం 15 నిమిషాల్లో కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ ఆధారిత ఈ కేవైసీ మాత్రమే అవసరమవుతుంది. సీనియర్ సిటిజన్లు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్డును డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.