
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రానుందా? త్వరలోనే డియర్ నెస్ అలోవెన్స్(డీఏ)ను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందా? అంటే అవుననే సమాధానామే వస్తోంది. పలు ఆన్ లైన్ నివేదికలు చెబుతున్న దాని ప్రకారం దాదాపు 4శాతం డీఏను ఈ మార్చిలో అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఇది అమలైతే ఉద్యోగుల డియర్ నెస్ అలొవెన్స్, డియర్ నెస్ రిలీఫ్(డీఆర్) అనేది 50శాతం దాటిపోతుంది. ఈ సర్దుబాటు కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ పారిశ్రామిక కార్మికుల కోసం రూపొందించిన వినియోగదారుల ధరల సూచి(సీపీఐ) డేటా ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం 12 నెలల సగటు డేటా 392.83గా ఉంది. ఈ గణాంకాల ఆధారంగా డీఏ అనేది ప్రాథమిక వేతనంలో దాదాపు 50.26శాతం అవుతుంది.
7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదిత ఫార్ములా ప్రకారం డీఏ పెంపు ఉంటుంది. 2023 అక్టోబర్లో క్యాబినెట్ చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను నాలుగు శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. ఇప్పుడు మరో 4శాతం పెంచాలని నిర్ణయించారు. కాగా ఇది 2024, జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా నాలుగు నెలల ఏరియర్లు పొందుకునే అవకాశం ఉంది.
కాగా 2023లో తీసుకున్న నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందారు. గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్‌లను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్‌ల (అడ్ హాక్ బోనస్‌లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ₹ 7,000 పరిమితిని నిర్ణయించింది .
దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) 12 నెలల సగటు పెరుగుదల శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో అలవెన్సులను సవరిస్తున్నప్పటికీ, సాధారణంగా మార్చి, సెప్టెంబర్‌లో నిర్ణయం ప్రకటిస్తారు. రాబోయే డీఏ పెంపు తర్వాత, ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..