పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫైల్ చేసే ప్రక్రియను సౌకర్యవంతంగా చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు వివిధ టూల్స్ , ఫీచర్లను పరిచయం చేస్తుంది. తాజాగా ఆ శాఖ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనిని ‘డిస్కార్డ్ రిటర్న్’ అంటారు. అసలు ‘డిస్కార్డ్ రిటర్న్’ అంటే ఏమిటి ? అది ఎలా పని చేస్తుంది? మీరు డిస్కార్డ్ రిటర్న్, ఆప్షన్‌ను పొందినట్లయితే మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? పన్ను చెల్లింపుదారులు తాము ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన తరువాత దానిని డిస్కార్డ్ చేయడానికి ఈ డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ అనుమతిస్తుంది. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. ఐటీఆర్ ను ధృవీకరించక ముందు మాత్రమే ఈ ఆప్షన్ ను ఉయోగించుకునే అవకాశం ఉంది.
మరో మాటలో చెప్పాలంటే, ఎవరైనా ITR ఫైల్ చేసిన తర్వాత అందులో తప్పులు ఉన్నాయని గుర్తిస్తే, అతను ఫైల్ చేసిన రిటర్న్‌ను IT డిపార్ట్‌మెంట్ రికార్డుల నుండి తొలగించవచ్చు. ఆ తర్వాత వారు కొత్త రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ‘డిస్కార్డ్’ ఆప్షన్ ను ప్రవేశపెట్టడానికి ముందు పన్ను చెల్లింపుదారులకు తాము దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను తొలగించే సదుపాయం లేదు. దీనర్థం ఎవరైనా ఇదివరకే రిటర్న్‌ను ఫైల్ చేసి ఆ తర్వాత ఎర్రర్‌ను కనుగొంటే దానిని డిస్కార్డ్ చేసే అవకాశం వారికి ఉండేది కాదు.
ముందుగా, వారు రిటర్న్‌ని ధృవీకరించాలి. ధృవీకరణ తర్వాత వారు తమ తప్పులను సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఈ ప్రక్రియ తరచుగా ITR ఫైలింగ్ చేసే విధానాన్ని పొడిగిస్తుంది. ఇప్పుడు, కొత్త ఫీచర్‌తో… రివైజ్డ్ రిటర్న్‌ను ఫైల్ చేసే సుదీర్ఘ ప్రక్రియ లేకుండా… అసలు రిటర్న్‌లోని లోపాలను సరిదిద్దవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్ ధృవీకరించనంత వరకు మీరు దానిని డిస్కార్డ్ చేయవచ్చు. ఒకవేళ మీరు అప్పటికే ఐటీఆర్‌ని ధృవీకరించినట్లయితే మీరు డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ ను ఉపయోగించలేరని గుర్తుంచుకోండి. డిస్కార్డ్ రిటర్న్‌ల ఫీచర్.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. అంటే 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ తో పాటు ఆ తరువాతి నుంచి వర్తిస్తుంది. అంటే ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత దాఖలు చేసిన రిటర్న్‌లను తొలగించవచ్చు అని అర్థం. ఒకసారి రిటర్న్‌ను డిస్కార్డ్ చేసినట్లయితే దానిని తిరిగి పొందడం సాధ్యం కాదు. అందుకే ఈ ఆప్షన్ ను జాగ్రత్తగా ఉపయోగించండి.
మీరు పాత రిటర్న్‌ను డిస్కార్డ్ చేశాక.. కొత్త రిటర్న్‌ను గడువు ముగిసిన తర్వాత ఫైల్ చేస్తే, జరిమానాలు వర్తిస్తాయని మర్చిపోవద్దు. మీరు జూలై 30, 2023న ఒరిజినల్ రిటర్న్‌ని ఫైల్ చేశారని అనుకుందాం.. కానీ దానిని వెరిఫై చేయలేదు. ఒకవేళ అందులో ఆదాయానికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని నమోదు చేయడం మర్చిపోయారని గుర్తొస్తే.. అప్పుడు దాన్ని తొలగించి, కొత్త రిటర్న్‌ను ఫైల్ చేయడానికి… డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ ను ఉపయోగించవచ్చు. అయితే మీరు సెక్షన్ 139(1) ప్రకారం.. దాఖలు చేసిన రిటర్న్‌ను ఒకసారి డిస్కార్డ్ చేసిన తర్వాత, దాన్ని తిరిగి పొందడం సాధ్యం కాదు.
కొత్త రిటర్న్ 31 జూలై గడువు తర్వాత దాఖలు అయ్యింది. సెక్షన్ 234F కింద ఆలస్య రుసుము వసూలు చేస్తారు. ఆలస్యంగా ఫైల్ చేసిన రిటర్న్‌ల విషయంలో ఇది వర్తిస్తుంది. మీరు జూలై 30న మొదటి రిటర్న్‌ను దాఖలు చేశారు. మీరు జరిమానా నుంచి తప్పించుకోలేరు. రూ. 5,000 వరకు ఈ జరిమానా ఉంటుంది. ఇప్పుడు మీరు డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ ను ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకుందాం.
ఆదాయపు పన్ను రిటర్న్‌ని డిస్కార్డ్ చేయడం కోసం ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌కి వెళ్లాలి. అది www.incometax.gov.in. పాన్, పాస్‌వర్డ్‌ని వివరాలు నమోదు చేసి, ఆపై లాగిన్ చేయండి. మెనూ బార్ కింద ఫైల్ ఆప్షన్ కు వెళ్లాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత ఇ-వెరిఫై ITRపై క్లిక్ చేయండి. ఇక్కడ, మీరు డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ ను చూడవచ్చు. ఇక్కడ మీరు ఫైల్ చేసి ధృవీకరించని రిటర్న్‌ను డిస్కార్డ్ చేయవచ్చు.
సెక్షన్ 139 (4) ప్రకారం, మీరు దాఖలు చేసిన లేట్ రిటర్న్‌ల కోసం.. డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. సెక్షన్ 139 (5) కింద… మీరు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసిన సందర్భంలో కూడా ఈ ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.
ఇక్కడ కూడా రిటర్న్‌లో పొరపాటు ఉంటే, మీరు పాత రిటర్న్‌ను తొలగించి, కొత్త ITR రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. మరో విషయం.. ITR ఫైల్ చేసిన తర్వాత, దానిని వెరిఫై చేయండి. ఆ తర్వాత మాత్రమే రిటర్న్ ప్రాసెస్ అవుతుంది. రిఫండ్ కూడా వస్తుంది. మీ రిటర్న్ వెరిఫై అవ్వకపోతే.. మీ రిటర్న్ చెల్లనిదిగా పరిగణించినట్టు అర్థం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి