
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, డాలర్ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టులో “బంగారం ఖరీదవడం లేదు.. డాలర్ చవకబారుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రజలు బంగారం ధరలు పెరుగుతున్నాయని భావిస్తున్నప్పటికీ, వాస్తవానికి అమెరికన్ డాలర్ కొనుగోలు శక్తి తగ్గిపోవడమే అసలు సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
కియోసాకి ప్రకారం చాలా మంది జీతాలు పెరిగాయని భావిస్తున్నా, నిజానికి కరెన్సీ విలువ పడిపోవడంతో ఎక్కువ నోట్లు చేతికి వస్తున్నాయే తప్ప సంపద పెరగడం లేదన్నారు. ఈ విషయాన్ని వివరించేందుకు తన స్నేహితుడి కుటుంబాన్ని ఉదాహరణగా చెప్పారు. ఒకప్పుడు 10 వేల డాలర్లకు కొనుగోలు చేసిన ఇల్లు నేడు 7.5 లక్షల డాలర్ల విలువకు చేరిందని, అదే సమయంలో తీసుకున్న 10 వేల డాలర్ల జీవిత బీమా పాలసీ మాత్రం ఇప్పటికీ అదే విలువలో ఉందని వివరించారు. “ఒక ఆస్తి ద్రవ్యోల్బణాన్ని అనుసరించింది.. మరొకటి అనుసరించలేదు” అని వ్యాఖ్యానించారు.
1971 నుంచి అమెరికన్ డాలర్ తన కొనుగోలు శక్తిలో 93 శాతం కోల్పోయిందని కియోసాకి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను అదే కరెన్సీలో పొదుపు చేయమని ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు అవసరానికి మించి డబ్బు ముద్రించడం వల్ల కరెన్సీ విలువ క్రమంగా తగ్గిపోతుందని, ఇది చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాల పతనానికి కారణమైందని చెప్పారు. కోవిడ్ సమయంలో అమెరికా భారీగా డబ్బు ముద్రించిందని కూడా గుర్తుచేశారు. డాలర్‌ను నిజమైన డబ్బుగా కాకుండా ప్రతి ఏడాది విలువ కోల్పోతున్న ఒక కొలమానంగా చూడాలని కియోసాకి సూచించారు. బంగారం వేల ఏళ్లుగా తన విలువను నిలబెట్టుకుందని, పేపర్ కరెన్సీలు మాత్రం కాలక్రమంలో బలహీనపడతాయని అన్నారు. అందుకే డాలర్లను దాచుకోవడం కంటే బంగారం, వెండి, బిట్‌కాయిన్, భూమి వంటి నిజమైన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపదను కాపాడుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు.