మీరు వాడిన దానికంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందా.. ఒక్క కాల్‌తో సమస్యకు చెక్ పెట్టండిలా..

Electricity Bill: ఎండలు మండిపోతున్నాయి.. ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నాయి. అయితే గాలి చల్లగా ఉన్నా.. నెలాఖరున వచ్చే కరెంట్ బిల్లు మాత్రం చెమటలు పట్టిస్తోంది.. మీరు వాడిన దానికంటే ఎక్కువ బిల్లు వస్తోందా? మీటర్ రీడింగ్‌లో తప్పులున్నాయని అనుమానంగా ఉందా? ఆందోళన వద్దు.. ఒక్క కాల్‌తో మీ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం..

మీరు వాడిన దానికంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందా.. ఒక్క కాల్‌తో సమస్యకు చెక్ పెట్టండిలా..
How To Reduce Electricity Bill

Updated on: Apr 26, 2026 | 9:20 PM

భానుడి భగభగలు మొదలయ్యాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే వీటి వాడకంతో పాటు నెలాఖరున వచ్చే విద్యుత్ బిల్లు కూడా సామాన్యుల జేబుకు చిల్లు పెడుతోంది. చాలా సందర్భాల్లో మనం వాడిన దానికంటే ఎక్కువ బిల్లు రావడం, రీడింగ్‌లో తప్పులు జరగడం చూస్తుంటాం. ఇలాంటప్పుడు ఆందోళన చెందకుండా, మీ హక్కులను ఎలా ఉపయోగించుకోవాలో, బిల్లును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అధిక బిల్లుకు కారణాలేంటి..?

కేవలం వాడకం పెరగడమే కాకుండా ఇతర సాంకేతిక కారణాల వల్ల కూడా బిల్లు భారీగా రావచ్చు.

మీటర్ లోపాలు: విద్యుత్ మీటర్ మొరాయించడం లేదా వేగంగా తిరగడం.

రీడింగ్ తప్పులు: సిబ్బంది రీడింగ్ తీసేటప్పుడు అంకెలు తప్పుగా నమోదు చేయడం.

బకాయిలు: గత నెల కట్టిన బిల్లు అప్‌డేట్ కాకపోవడం వల్ల, ఆ మొత్తం ప్రస్తుత బిల్లులో కలిసి రావడం.

పరిష్కారం మీ చేతుల్లోనే: హెల్ప్‌లైన్ నంబర్ 1912

విద్యుత్ బిల్లులో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్రం దేశవ్యాప్తంగా 1912 అనే ఒకే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1912కు కాల్ చేసి, మీ కస్టమర్ ఐడి లేదా RR నంబర్ చెబితే ప్రతినిధులు ఫిర్యాదు నమోదు చేసుకుంటారు. ఈ నంబర్ రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

వాట్సాప్ ద్వారా సులభంగా..

కాల్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే, మీరు వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

  • మీ ఫోన్‌లో 8800001915 నంబర్‌ను సేవ్ చేసుకోండి.
  • Hi అని మెసేజ్ పంపి, అక్కడ వచ్చే ఆప్షన్లలో మీ భాషను ఎంచుకుని ఫిర్యాదు నమోదు చేయండి.
  • ఫిర్యాదు చేశాక మీకు వచ్చే రిఫరెన్స్ నంబర్ ద్వారా మీ సమస్య ఏ దశలో ఉందో ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా 3 నుండి 7 రోజుల్లో అధికారులు మీ ఇంటికి వచ్చి మీటర్ తనిఖీ చేస్తారు.

బిల్లు తగ్గించుకోవడానికి చిట్కాలు

ఫిర్యాదు చేయడంతో పాటు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బిల్లును నియంత్రించవచ్చు..

LED బల్బులు: పాత ఫిలమెంట్ బల్బుల స్థానంలో LED బల్బులను వాడండి. ఇవి 80శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేస్తాయి.

స్టార్ రేటింగ్: ఏసీ లేదా ఫ్రిజ్ కొనేటప్పుడు 5-స్టార్ రేటింగ్ ఉన్నవి ఎంచుకోండి.

ఏసీ టెంపరేచర్: ఏసీని ఎప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉంచడం వల్ల కంప్రెసర్ మీద భారం తగ్గి బిల్లు తక్కువగా వస్తుంది.

అనవసర ప్లగ్స్: వాడనప్పుడు మొబైల్ ఛార్జర్లు, టీవీ స్విచ్‌లు ఆపివేయండి. ప్లగ్ పాయింట్లలో ఉండే లీకేజ్ కరెంట్ కూడా బిల్లు పెరగడానికి కారణమవుతుంది.

Follow Us