
సాంప్రదాయ ఉద్యోగ విధానానికి భిన్నంగా, నేటి జెన్ జి యువత కొత్త కెరీర్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒక్క ఉద్యోగంపై ఆధారపడకుండా, ఒకేసారి అనేక ఆదాయ వనరులను సృష్టించుకోవడం వైపు యువ పారిశ్రామికవేత్తలు వేగంగా అడుగులు వేస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది. LinkedIn విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం దాదాపు నలుగురిలో ముగ్గురు జెన్ జి వ్యవస్థాపకులు ప్రస్తుతం బహుళ ఆదాయ మార్గాల ద్వారా సంపాదిస్తున్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జెన్ జి వర్గం, సంప్రదాయ 9-టు-5 ఉద్యోగాల కంటే స్వేచ్ఛ, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఫ్రీలాన్సింగ్, స్టార్టప్‌లు, డిజిటల్ కంటెంట్, కన్సల్టింగ్, ఈ-కామర్స్ వంటి విభిన్న రంగాల్లో ఒకేసారి అవకాశాలను వెతుకుతున్నారు.
ఈ ధోరణిని పోర్ట్‌ఫోలియో కెరీర్ గా పిలుస్తున్నారు. అంటే ఒకే కెరీర్‌పై ఆధారపడకుండా, అనేక రంగాల్లో పని చేస్తూ ఆదాయాన్ని విభజించుకోవడం. ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఇది మరింత భద్రతను కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. నివేదిక ప్రకారం 1965-1980 మధ్య జన్మించిన జెన్ ఎక్స్ వర్గంలో బహుళ ఆదాయ వనరులు కలిగిన వారి శాతం 62 మాత్రమే కాగా, జెన్ జి వర్గంలో అది మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా భారతదేశం ఈ మార్పులో ప్రపంచానికి ఒక కీలక సూచికగా మారిందని లింక్డ్‌ఇన్ పేర్కొంది.
భారత్‌లో తమ ప్రొఫైల్‌లకు ఫౌండర్ అనే పదాన్ని జోడిస్తున్న సభ్యుల సంఖ్య ఏటా 104 శాతం పెరిగిందని డేటా వెల్లడించింది. ఇది దేశంలో స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు, సోలోప్రెన్యూర్‌ల పెరుగుదలను సూచిస్తోంది. 2026 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 500 చిన్న వ్యాపారాలు, వ్యవస్థాపకులు, సోలోప్రెన్యూర్‌లపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. కృత్రిమ మేధస్సు (AI) కొత్త అవకాశాలను సృష్టిస్తుండటంతో, యువత ఉద్యోగాల కంటే స్వయం ఉపాధి, డిజిటల్ ఆదాయాల వైపు వేగంగా మళ్లుతున్నట్లు ఈ సర్వే తేల్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి