
Cooking Oil: వంట నూనె విక్రయాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కల్తీని అరికట్టడం, ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. FDA కమిషనర్ తుకారాం ముండే ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ఇకపై లూజ్‌గా లేదా ప్యాకెట్ లేకుండా వంట నూనెను విక్రయించడాన్ని నిషేధిస్తూ FDA ఆదేశాలు జారీ చేసింది. నూనెను తప్పనిసరిగా సీల్ చేసిన, ట్యాంపర్ ప్రూఫ్, పూర్తి వివరాలతో కూడిన ప్యాకేజీలోనే విక్రయించాలి. ఈ నిబంధనలు తయారీదారుల నుంచి రిటైలర్లు, ఆన్‌లైన్ విక్రేతల వరకు మొత్తం సరఫరా వ్యవస్థకు వర్తిస్తాయి.
నిబంధనలను ఉల్లంఘించి అసురక్షిత ఆహారం విక్రయించడం, కల్తీ పదార్థాలు కలిగి ఉండటం లేదా సరైన లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం వంటి వాటికి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. సబ్‌స్టాండర్డ్ నూనెకు రూ.5 లక్షల వరకు, తప్పుదోవ పట్టించే లేబులింగ్‌కు రూ.3 లక్షల వరకు జరిమానా ఉండవచ్చు. అంతేకాకుండా, నిబంధనల తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఆవ నూనెలో ఇతర నూనెలను అనధికారికంగా కలపడం కూడా నిషేధించారు. ఆవ నూనెను 100 శాతం స్వచ్ఛమైనదిగా విక్రయించాల్సి ఉంటుందని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. తనిఖీల్లో చౌకైన ఇతర నూనెలను కలపడం, లేబుల్స్ మార్చడం, గడువు సమీపించిన నూనెను తిరిగి ప్యాక్ చేయడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
మినరల్ ఆయిల్, పెయింట్స్, కెమికల్స్ లేదా ఇతర పదార్థాలను నిల్వ చేసిన కంటైనర్లను తిరిగి వంట నూనె కోసం ఉపయోగించడాన్ని కూడా FDA నిషేధించింది. తుప్పుపట్టిన, పగిలిన లేదా సరిగా లేని కంటైనర్లను ఉపయోగిస్తే నూనె కలుషితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లలో వంట నూనెను పదేపదే వేడి చేసి ఉపయోగించడంపై కూడా FDA దృష్టి పెట్టింది. ఇలా చేయడం వల్ల హానికరమైన పదార్థాలు పెరిగే అవకాశం ఉందని, అందుకే వాడిన నూనెను తిరిగి ఆహార తయారీలో ఉపయోగించకూడదని సూచించింది.
ఇది కూడా చదవండి: Gold Price: సెప్టెంబర్‌లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా..?
వినియోగదారులు వంట నూనె కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యమైన అప్‌డేట్: ఈ నిబంధనలపై వ్యాపారుల నుంచి అభ్యంతరాలు రావడంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జోక్యం చేసుకుని, ఆహార భద్రతను కాపాడుతూనే సంప్రదాయ వ్యాపారాలు కొనసాగేందుకు ఒక SOP (Standard Operating Procedure) రూపొందించాలని FDAని ఆదేశించినట్లు ఆగస్టు 25న Indian Express నివేదించింది.
ఇది కూడా చదవండి: Auto News: రూ.15 వేల EMIకే కొత్త కారు.. ఈ బడ్జెట్‌లో అదిరిపోయే కార్లు ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి