
ప్రతి శనివారం ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవు అంటూ ఒక నకిలీ గెజిట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గత కొద్ది రోజులుగా విపరీతంగా ప్రచారం అవుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసిందంటూ వరల్ చేస్తున్నారు. ఈ నకిలీ గెజిట్‌పై శాలిని పండిట్ అనే జాయింట్ సెక్రటరీ సంతకం కూడా ఉంది. ఇది నిజమే అనుకుని అనేకమంది సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారు. శనివారం కూడా బ్యాంకులకు సెలవు ప్రకటిస్తే.. ప్రజలకు బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, దీని వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ రంగ బ్యాంకులను వినియోగిస్తుండగా.. అలాంటి కీలక నిర్ణయం గురించి నకిలీ వార్తలు వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించింది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం వైరల్ గెజిట్‌పై స్పందించింది.
కేంద్ర ప్రభత్వం ఎలాంటి గెజిట్ విడుదల చేయలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పత్రం నకిలీదని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసిన ప్రకటన ప్రకారం.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ పత్రం పూర్తిగా నకిలీదని, ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్ ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కంటెంట్‌ను పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు నివేదించాలని సూచించింది. ఇలాంటి నకిలీ గెజిట్‌లు, ప్రభుత్వ నోటిఫికేషన్‌లను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల సమాజంలో గందరగోళం ఏర్పడుతుందని పేర్కొంది. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, అనవసరమైన ఆందోళనకు గురి చేయవద్దని సూచించింది.
గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి నకిలీ పత్రాలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరమని, దీనిని సృష్టించిన, ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రతి శనివారం సెలవు నిబంధన లేదు. కేవలం ప్రతి నెలా రెండవ శనివారం, నాల్గవ శనివారం మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇతర శనివారాలలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. ప్రజలు బ్యాంకింగ్ సేవలు పొందడానికి వెళ్లే ముందు కేవలం నమ్మదగిన, అధికారిక ఫ్లాట్‌ఫామ్స్ నుండి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని పీఐబీ పదే పదే విజ్ఞప్తి చేస్తోంది.