EPFO: పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తున్నారా..? క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం మరింత ఈజీ.. ఒక క్లిక్‌తోనే మొత్తం..
ఈపీఎఫ్‌వో పోర్టల్ అప్‌గ్రేడ్ చేశారు. మరింత వేగంగా చందాదారులు వివరాలు పొందేలా మార్పులు చేశారు. దీంతో అన్నీ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్, ట్రాన్స్ ఫర్ లాంటి పనులన్నీ వేగంగా చేసుకోవచ్చు. కొత్త పోర్టల్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయంటే.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పోర్టల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఉన్న పోర్టల్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా మారింది. పీఎఫ్ ఆన్‌లైన్ సేవలను మరింత వేగంగా ఖాతాదారులకు అందించేందుకు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు ఈ ప్రాసెస్ పూర్తవ్వగా.. త్వరలో కొత్త వెర్షన్ అందుబాటులోకి రానుంది. పోర్టల్‌లో కొత్తగా తీసుకొచ్చిన మార్పుల వల్ల ఇక నుంచి పీఎఫ్ క్లెయిమ్‌లను ట్రాక్ చేయడం, సర్వీస్ హిస్టరీని చూసుకోవడం, బ్యాలెన్స్ చూసుకోవడం, బ్యాలెన్స్ ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి బదిలీ చేయడం లాంటివి మరింత సులువు కానున్నాయి. అసలు కొత్త పోర్టల్‌లో జరిగిన మార్పులు ఏంటనేది చూద్దాం.
ఏయే మార్పులు కొత్తగా వచ్చాయి..?
-పీఎఫ్ వ్యవస్థను సెంట్రలైజ్డ్ చేశారు. దీంతో అందరి వివరాలు ఒకే డేటాబేస్‌లో లభిస్తాయి
-క్లెయిమ్‌లు పేపర్‌లెస్ విధానంలో ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతాయి
-ఉద్యోగం మారినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక కంపెనీ నుంచి మరొ కంపెనీకి అకౌంట్ బదిలీ అవుతుంది
-క్లెయిమ్ దాఖలు చేసేముందు ఎంత మొత్తం విత్ డ్రా చేసుకునేందుకు మీకు అర్హత ఉందనేది ముందే తెలుసుకోవచ్చు
క్లెయిమ్‌కు సంబంధించి ఏవైనా వ్యత్యాసాలు లేదా సందేహాలు ఉంటే పోర్టల్, SMS రెండింటి ద్వారా తెలియజేస్తారు.
PF క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా.?
మీరు క్లెయిమ్ దాఖలు చేస్తే నిమిషాల వ్యవధిలోనే దాని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకేచోట అన్నీ క్లెయిమ్స్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
-EPFO పోర్టల్ ఓపెన్ చేయండి
-మీ UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి
-మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి
-అనంతరం హోమ్ పేజీలో ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ పై క్లిక్ చేయండి
-అక్కడ ‘ట్రాక్ క్లెయిమ్ స్టేటస్’ ఆప్షన్ ఎంచుకోండి
-అక్కడ గత, ప్రస్తుత క్లెయిమ్ వివరాలు, సమర్పించిన ఫారం, దరఖాస్తు తేదీ, ట్రాకింగ్ ఐడి, క్లెయిమ్ ప్రస్తుత స్టేటస్ లాంటి వివరాలు అన్నీ కనిపిస్తాయి
సర్వీస్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలి..?
పలుమార్లు ఉద్యోగాలు మారిన తర్వాత ప్రజలు తరచుగా తమ గత ఉద్యోగ వివరాలను మర్చిపోతుంటారు. అటువంటి సందర్భాలలో EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లోని ‘సర్వీస్ హిస్టరీ’ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు మీరు ఇంతకముందు ఏయే కంపెనీల్లో పనిచేశారు అనే వివరాలు తెలుసుకోవచ్చు. సర్వీస్ హిస్టరీ ఎలా చూసుకోవాలంటే..
-EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి
-మీ UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి
-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఉపయోగించి లాగిన్ అవ్వండి
-‘సర్వీస్ హిస్టరీ’ విభాగానికి వెళ్లండి
-ఇక్కడ మీ పూర్తి ఉద్యోగ చరిత్రను చూడవచ్చు
