
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఈపీఎఫ్‌వో 3.0 ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా యూపీఐ, ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా త్వరలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్ గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం పీఎఫ్ సంస్థ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం జూన్ 30వ తేదీ వరకు యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌లో సేవలను నిలిపివేసింది. జులై 1వ తేదీ నుంచి తిరిగి సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. దీంతో జులై 1వ తేదీ నుంచి యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసే సేవలు ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయతే ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఒకేసారి ఎంత డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు? దీని కోసం ప్రత్యేక ఏటీఎం కార్డు అందుబాటులో ఉంటుందా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఈపీఎఫ్‌వో ఇప్పటివరకు యూపీఐ లేదా ఏటీఎం లావాదేవీలకు ఎలాంటి ప్రత్యేక పరిమితులను అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే.. పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతంను యూపీఐ లేదా ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చని తెలుస్తోంది. యూపీఐ, ఏటీఎం ద్వారా తక్షణమే పీఎఫ్ అకౌంట్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ అవుతుంది. మిగిలిన 25 శాతం నగదు కనీస నిల్వ కింద అకౌంట్‌లో ఉంటుంది. ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునేందుకు వీలుగా పీఎఫ్ అనుసంధానిత ఏటీఎం కార్డును ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. డెబిట్ కార్డు తరహాలోనే ఈ కార్డు ద్వారా ఏటీఎం నుండి నేరుగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తం వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుత దీని పరీక్షలు పూర్తయ్యాయి.
– UPI యాప్‌లోకి ఆధార్ ఆధారిత వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ధృవీకరణ విజయవంతం కాగానే అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాకు డబ్బు తక్షణమే జమ చేయబడుతుంది. ఈపీఎఫ్‌వో ఖాతాదారులు దీని కోసం ఎప్పటినుంచో ఎదుచూస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి ఎట్టకేలకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే యూపీఐ యాప్స్ ద్వారా సెకన్లలోనే ఎప్పుడైనా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.