
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) వేతన పరిమితిని పెంచడం వల్ల కొంతమంది ఉద్యోగుల చేతికి అందే జీతాలలో తగ్గుదల కనిపించింది. అక్టోబర్ శాలరీ క్రెడిట్‌కు సంబంధించి ఎస్ఎంఎస్‌లు అందుకున్న ఉద్యోగులు తమ జీతంలో తొలగింపును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.25 వేలకు కేంద్రం పెంచడం వల్ల ప్రతి నెలా కొంత అదనపు మొత్తం పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్‌గా వెళ్తుంది. దీనివల్ల ప్రస్తుతానికి ఉద్యోగులకు వచ్చే టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. ఉద్యోగుల మూల వేతనంలో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. వేతన పరిమితి పెంచడంతో ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులు అదనపు మొత్తాన్ని పీఎఫ్‌కు జమ చేయాల్సి వస్తుంది. ఇది టేక్ హోం శాలరీ తగ్గడానికి దారితీస్తుంది. అయితే ఈ పెంపుదలలో దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అధిక కంట్రిబ్యూషన్ వల్ల రిటైర్మెంట్ సమయానికి వడ్డీతో కలిపి ఎక్కువ మొత్తంలో పీఎఫ్ కార్పస్ ఉద్యోగులకు అందుతుంది. ఇది వారి పదవీ విరమణ జీవితానికి ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుంది.
తక్షణం మీ చేతికి డబ్బులు రాకపోయినప్పటికీ.. భవిష్యత్ ఆర్థిక ప్రణాళిక దృష్ట్యా ఇది ఒక లాభదాయకమైన పెట్టుబడి మార్గంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మార్పుల ప్రకారం ఈపీఎఫ్ వేజ్ సీలింగ్‌ను పెంచారు. గతంలో రూ.15 వేల వేజ్ సీలింగ్ ప్రకారం 12 శాతం అంటే రూ.1,800 కట్ అయ్యేది. ఇప్పుడు ఈ సీలింగ్ రూ.25,000కి పెరగడంతో రూ.3,000 కట్ వుతుంది. అంటే ప్రతి నెలా మీ జీతం నుండి అదనంగా రూ.1,200 తగ్గించబడుతుంది. అంటే సంవత్సరానికి మీ చేతికి వచ్చే జీతం రూ.14,400 తగ్గుతుంది. EPFలో జమ అయిన మొత్తాన్ని మీరు భవిష్యత్తులో విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ EPSలో జమ అయిన మొత్తం పెన్షన్ ప్రయోజనాల కోసం ఉద్దేశించబడింది. దానిని విత్‌డ్రా చేయడం సాధ్యం కాదు.
పాత కంపెనీల నుండి PF పెండింగ్‌లో ఉండటం, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్‌డేట్ కాకపోవడం లేదా PF బదిలీ,క్లెయిమ్ సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈ మార్పులు మరింత క్లిష్టంగా మారవచ్చు. అలాంటి సందర్భాలలో మీ పాత పీఎఫ్‌ను చట్టబద్ధంగా ఎలా బదిలీ చేయాలి లేదా క్లెయిమ్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. అలాగే యజమానితో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవడం అవసరం. సరైన నిబంధనలను పాటించడం ద్వారా పీఎఫ్ ప్రయోజనాలను సురక్షితంగా పొందవచ్చు.