Tax Evasion: చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమీ(Xiaomi) గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్‌కు బెంగళూరులోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. విదేశీ మారకపు చట్టం(Money laundering) ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఈడీ ఆయనను ప్రశ్నించనున్నారు. గత కొన్నేళ్లుగా సంస్థ స్వీకరించిన విదేశీ చెల్లింపుల విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో కంపెనీకి చెందిన ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్ అధికారులను ఈడీ విచారిస్తోంది.
వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని లేదా అధికారిక ప్రతినిధిని పంపించాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది. షావోమీ షేర్‌హోల్డింగ్స్, కాంట్రాక్టులు సహా నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు అందించాలని నోటీసులో కోరింది. సంస్థ ఇండియా కార్యాలయానికి వచ్చిన చెల్లింపులు, విదేశాలకు సంస్థ చేసిన చెల్లింపుల లావాదేవీలను తెలపాలని స్పష్టం చేసింది. గతంలో షావోమీ ఇండియా హెడ్‌గా మను కుమార్.. ఇటీవలే గ్లోబల్ హెడ్ బాధ్యతలు చేపట్టారు. ఈడీ నోటీసులకు స్పందించిన సంస్థ ప్రతినిధి.. భారతీయ చట్టాలను గౌరవిస్తామని వెల్లడించారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. నోటీసుల్లో అడిగిన వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
కంపెనీపై ఆరోపణలు ఏంటంటే..
షావోమీ కంపెనీపై ఇంతకు ముందు పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీతో పాటు మరికొన్ని చైనా మొబైల్ తయారీ సంస్థలపైనా ఆదాయ పన్ను శాఖ 2021 డిసెంబర్లో దాడులు చేసింది. రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలతో ఆ సంస్థకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది. షావోమీ ఇండియాకు చెందిన ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో.. దిగుమతి సుంకం ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) స్వాధీనం చేసుకుంది.
ఇవీ చదవండి..
Economic crisis: శ్రీలంకను మించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ మూడు దేశాలు.. ఎందుకంటే..
Maternity Insurance: మెటర్నిటీ ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ చేసుకోండి.. పూర్తి వివరాలు..