EGG Price: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరగనున్న గుడ్ల ధరలు.. ఎందుకంటే?

మీకు రోజూ ఎగ్స్ తినే అలవాటు ఉందా? అయితే మీ పాకెట్‌కు త్వరలోనే భారీ చిల్లు పడబోతుంది. అవును రాబోయే రోజుల్లో గుడ్ల ధరలు భారీగా పెరగబోతున్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అసలు ఈ ధరలు ఎందుకు పెరగబోతున్నాయి. ఫ్యూచర్లో గుడ్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

EGG Price: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరగనున్న గుడ్ల ధరలు.. ఎందుకంటే?
Egg Price Hike

Updated on: Sep 06, 2026 | 10:56 AM

తక్కువ ధరలో ఎక్కువ ప్రొటీన్ అందించే ఆహారం ఏదైనా ఉందంటే.. అది కేవలం కోడిగుడ్డు మాత్రమే. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న పిల్లల నుంచి గర్భిణులు, వృద్ధుల వరకు అందరికీ ఇది ఎంతో ఉపయోగకరమైన ఆహారం. కానీ గత కొన్ని రోజులుగా వీటి కొనుగోలు శాతం గణనీయంగా తగ్గిపోయిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గుడ్ల ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది వాటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు.

సర్వేలో తెరపైకి గుడ్ల వినియోగం

‘లోకల్‌సర్కిల్స్’ అనే సంస్థ దేశవ్యాప్తంగా 287 జిల్లాల్లోని 67,000 మందికి పైగా వినియోగదారుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. గత ఆరు నెలల్లో గుడ్ల ధరలు 10 నుంచి 50 శాతానికి పైగా పెరిగాయి. ఈ ధరల భారం వల్ల దాదాపు 48 శాతం కుటుంబాలు గుడ్ల కొనుగోలును తగ్గించుకున్నట్టు తేలింది. గతంలో ఫామ్‌ల వద్ద ఒక్కో గుడ్డు ధర రూ. 4.94 ఉండగా, ఇప్పుడు అది రూ. 7కి చేరింది. దీంతో బహిరంగ మార్కెట్లలో రిటైల్ ధర ఏకంగా రూ. 8.50 నుంచి రూ. 9 వరకు చేరింది. ఫలితంగా వీటిని కొనడం భారంగా మారినట్టు వినియోగదారులు చెబుతున్నారు.

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు

ఒక్కసారిగా గుడ్ల ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం కోళ్లకు వేసే దాణా ఖర్చులేనని వ్యాపారులు అంటున్నారు. ఉత్పత్తి వ్యయంలో పౌల్ట్రీ దాణాకు అయ్యే ఖర్చే 65 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. ముఖ్యంగా దాణాలో వాడే మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమల నుంచి గిరాకీ పెరగడంతో మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. దీనికితోడు ఎండల తీవ్రత కూడా మరో కారణంగా కనిపిస్తోంది. తీవ్రమైన ఎండల వల్ల కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 16 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇది కూడా ధరల పెరుగుదలకు దారితీసింది.

ఈ ధరల పెరుగుదల ప్రభుత్వ పథకాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల వంటి ప్రభుత్వ పోషకాహార పథకాల నిర్వహణ భారంగా మారింది. ఒడిశాలో ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ. 7 ధర నిర్ణయించగా.. కేంద్రాలు మార్కెట్లో ఒక్కో గుడ్డుకు రూ. 9 నుంచి రూ. 10 వరకు చెల్లించాల్సి వస్తోంది. ధరల సమస్యతో పాటు నాణ్యత, కల్తీ భయాల కారణంగా కూడా చాలామంది వినియోగదారులు వీటి వినియోగాన్ని తగ్గించారు.

మరింత పెరిగే అవకాశం

ప్రస్తుతం వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంది. సాధారణంగా చలికాలంలో గుడ్ల వినియోగం పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాల రోజువారీ ప్రొటీన్ పోషకాహార లభ్యతకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us