సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే థెరపీ ఖర్చులు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే!

మానసిక ఒత్తిడితో బాధపడేవారు దాని నుంచి బయటపడేందుకు నిపుణుల సహాయం తీసుకోవాలని భావిస్తారు. అయితే థెరపీ సెషన్లకు అయ్యే ఖర్చులు కూడా ఆందోళన కలిగిస్తుంటాయి. ఆరోగ్య బీమా పాలసీ ఉందని, సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్‌ను సంప్రదిస్తే ఆ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం అలా ఉండకపోవచ్చు. పాలసీలో మానసిక ఆరోగ్య చికిత్సకు కవరేజీ ఉన్నప్పటికీ, సాధారణ కౌన్సెలింగ్, తరచుగా తీసుకునే థెరపీ సెషన్లకు బీమా వర్తించకపోవచ్చు. అందుకే చికిత్స ప్రారంభించే ముందు పాలసీలోని నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే థెరపీ ఖర్చులు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే!
Health Insurance Cover Psychotherapy

Updated on: Oct 12, 2026 | 9:18 AM

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారు ముందుగా పాలసీ షెడ్యూల్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (CIS), పూర్తి పాలసీ నిబంధనలను పరిశీలించాలి. అందులో ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD), సైకోథెరపీ, సైకాలజిస్ట్, కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య చికిత్స వంటి పదాల కోసం వెతకాలి. కవర్‌ష్యూర్ వ్యవస్థాపకుడు, సీఈఓ సౌరభ్ విజయ్‌వెర్జియా దీని గురించి మాట్లాడుతూ.. పాలసీలో మానసిక ఆరోగ్య కవరేజీ ఉందనే సాధారణ ప్రకటనను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదని సూచించారు. నిర్దిష్ట పాలసీలో ఏయే ప్రయోజనాలు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకోవాలని తెలిపారు. కొన్ని పాలసీలు మానసిక అనారోగ్యానికి సంబంధించిన ఆసుపత్రి చికిత్స ఖర్చులను మాత్రమే భరిస్తాయి. ఆసుపత్రిలో చేరకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించడం, కౌన్సెలింగ్ తీసుకోవడం లేదా క్రమం తప్పకుండా సైకోథెరపీ చేయించుకోవడం వంటి ఖర్చులకు కవరేజీ ఉండకపోవచ్చు. మరికొన్ని పాలసీల్లో ప్రత్యేక OPD ప్రయోజనం, అదనపు కవరేజీ లేదా ఉద్యోగ సంస్థ అందించే ఆరోగ్య బీమా ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉండవచ్చు.

కొన్ని బీమా పథకాలు అర్హత కలిగిన నిపుణుల వద్ద తీసుకున్న సెషన్లకు సంబంధించిన ఖర్చులను తిరిగి చెల్లిస్తాయి. మరికొన్ని నిర్దేశిత నెట్‌వర్క్, యాప్ లేదా ఆన్‌లైన్ సేవల ద్వారా కౌన్సెలింగ్ అందిస్తాయి. కొన్ని ఉచిత కౌన్సెలింగ్ సెషన్లు అందుబాటులో ఉన్నంత మాత్రాన దీర్ఘకాలిక సైకోథెరపీ ఖర్చులు కూడా కవర్ అవుతాయని భావించకూడదు. పాలసీలో ఉన్న మొత్తం బీమా రక్షణ (Sum Insured) చూసి మాత్రమే థెరపీ ఖర్చులు పూర్తిగా కవర్ అవుతాయని నిర్ణయించకూడదు. ఉదాహరణకు, రూ.10 లక్షల సమ్ ఇన్సూరెన్స్ ఉన్న పాలసీలో కూడా OPD చికిత్సకు పరిమిత కవరేజీ మాత్రమే ఉండవచ్చు. ఒక్కో సెషన్‌కు చెల్లించే గరిష్ఠ మొత్తం, సంవత్సరానికి అనుమతించే సెషన్ల సంఖ్య లేదా మొత్తం OPD పరిమితి వంటి నిబంధనలు ఉండొచ్చు.

ఒక వ్యక్తి నెలకు నాలుగు థెరపీ సెషన్లు తీసుకుంటున్నారని అనుకుందాం. ఒక్కో సెషన్‌కు రూ.1,500 చెల్లిస్తే నెలకు రూ.6,000 ఖర్చవుతుంది. ఏడాదికి ఈ మొత్తం రూ.72,000 అవుతుంది. అయితే, పాలసీలో OPD కవరేజీ పరిమితంగా ఉంటే ఈ ఖర్చులో ఎక్కువ భాగాన్ని బాధితుడే భరించాల్సి రావచ్చు. అందువల్ల పాలసీదారులు ఈ కింది వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి..

  • సంవత్సరానికి అందుబాటులో ఉండే OPD కవరేజీ ఎంత?
  • ఒక్కో థెరపీ సెషన్‌కు చెల్లించే గరిష్ఠ మొత్తం ఎంత?
  • ఏడాదిలో ఎన్ని సెషన్లకు మాత్రమే అనుమతి ఉంది?
  • కో-పేమెంట్ నిబంధన ఉందా?
  • డాక్టర్ కన్సల్టేషన్, పరీక్షలు, మందులకు ఒకే OPD పరిమితి వర్తిస్తుందా?

పాలసీలో మానసిక ఆరోగ్య చికిత్సకు కవరేజీ ఉన్నప్పటికీ, చికిత్స అందించే నిపుణుడికి సంబంధించిన అర్హత నిబంధనలు వర్తించవచ్చు. క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ లేదా ఇతర మానసిక ఆరోగ్య నిపుణుల వద్ద తీసుకునే చికిత్సలకు ఒకే విధమైన నిబంధనలు ఉండకపోవచ్చు. అందువల్ల అపాయింట్‌మెంట్ తీసుకునే ముందే తమకు నచ్చిన నిపుణుడి వద్ద చికిత్స తీసుకుంటే బీమా వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. అలాగే, చికిత్సకు సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్, రోగ నిర్ధారణ నివేదిక, రిఫరల్ లేదా ముందస్తు అనుమతి అవసరమా అని బీమా కంపెనీని అడగాలి. వెయిటింగ్ పీరియడ్, పాలసీలోని మినహాయింపులు, ఇప్పటికే కొనసాగుతున్న చికిత్సకు సంబంధించిన పరిమితులను కూడా పరిశీలించాలి. క్లెయిమ్ సమయంలో ఉపయోగపడే బిల్లులు, ప్రిస్క్రిప్షన్లు, ఇతర సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలి. పాలసీ నిబంధనల్లో ఏదైనా సందేహం ఉంటే బీమా కంపెనీ నుంచి రాతపూర్వక వివరణ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా, “నేను ఎంపిక చేసుకున్న నిపుణుడి వద్ద తరచుగా తీసుకునే OPD సైకోథెరపీకి నా పాలసీ వర్తిస్తుందా? ఎంత మొత్తం వరకు చెల్లిస్తారు? వెయిటింగ్ పీరియడ్, సెషన్ల పరిమితులు, అవసరమైన పత్రాలు ఏమిటి?” అని స్పష్టంగా అడగాలి.

పాలసీలో థెరపీ కవరేజీ లేకపోతే ఏం చేయాలి?

హెల్త్ ఇన్సూరెన్స్‌లో థెరపీ కవరేజీ లేకపోయినా, మానసిక ఆరోగ్య సేవలను పొందేందుకు ఇతర మార్గాలు ఉండవచ్చు. ఉద్యోగం చేస్తున్నవారు తమ సంస్థ అందించే కౌన్సెలింగ్ సేవలు లేదా ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (EAP) గురించి తెలుసుకోవాలి. వీటి ద్వారా నిపుణుల సహాయం లభించవచ్చు. అయితే, అందుబాటులో ఉండే సెషన్ల సంఖ్య, అర్హతలు, ఇతర నిబంధనలు సంస్థను బట్టి మారుతాయి. కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునేవారు లేదా అదనపు కవరేజీని ఎంచుకోవాలనుకునేవారు OPD మానసిక ఆరోగ్య చికిత్సకు స్పష్టమైన ప్రయోజనం ఉందో లేదో పరిశీలించాలి. ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు, కొనసాగుతున్న చికిత్సకు సంబంధించి బీమా కంపెనీ ఏ నిబంధనలు విధిస్తుందో తెలుసుకోవాలి. దరఖాస్తు సమయంలో కోరిన సమాచారాన్ని నిజాయతీగా వెల్లడించాలి. కొత్త పాలసీ తీసుకున్నంత మాత్రాన, ఆ పాలసీ ప్రారంభం కావడానికి ముందే చేసిన చికిత్సకు సంబంధించిన ఖర్చులు చెల్లిస్తారని భావించకూడదు.

మానసిక ఆరోగ్య చికిత్సకు బీమా తప్పనిసరిగా వర్తిస్తుందా?

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 (Mental Healthcare Act, 2017) ప్రకారం, మానసిక అనారోగ్య చికిత్సకు వైద్య బీమాను శారీరక అనారోగ్య చికిత్సకు సమాన ప్రాతిపదికన అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే, దీనర్థం ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణ OPD కన్సల్టేషన్లు, కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీ సెషన్లకు సంబంధించిన ప్రతి ఖర్చునూ భరిస్తుందని కాదు. చికిత్స స్వభావం, పాలసీలోని ప్రయోజనాలు, అర్హత కలిగిన నిపుణులు, OPD కవరేజీ, ఆర్థిక పరిమితులు వంటి అంశాలపై బీమా చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మానసిక ఆరోగ్య చికిత్స ప్రారంభించే ముందే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలను పూర్తిగా చదవాలి. ఏ చికిత్సకు కవరేజీ ఉంది? బీమా కంపెనీ ఎంత చెల్లిస్తుంది? ఎలాంటి పత్రాలు అవసరం? వంటి వివరాలను ముందుగానే తెలుసుకుంటే అనుకోని ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఆర్థిక భారం గురించి ఆందోళన తగ్గి, అవసరమైన మానసిక ఆరోగ్య సహాయాన్ని పొందేందుకు సరైన ప్రణాళిక వేసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us