మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఏ బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుందా అని వెతుకుతున్నారా? అది సురక్షిత పెట్టుబడి కావాలని ఆశిస్తున్నారా? అయితే మీకు మంచి పరిష్కారం దొరికనట్లే! పోస్ట్ ఆఫీస్ లో మంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇక్కడ బ్యాంకులు అందించే వడ్డీ కన్నా అధిక వడ్డీ లభిస్తుంది. పైగా మన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇది నడుస్తుంది కాబట్టి మీరు జమ చేస్తున్న డిపాజిట్లపై భరోసా ఉంటుంది. ఇంతకీ ఏంటా పథకం అని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే ఈ కథనాన్ని చదివేయండి.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. ఇది వ్యక్తులు తమ డబ్బును నిర్ణీత కాలానికి పెట్టుబడి పెట్టడానికి, ఇతర బ్యాంకు ఖాతాలతో పోల్చితే అధిక వడ్డీ పొందడానికి సాయపడుతుంది. పైగా ఇది సురక్షితమైన పెట్టుబడి విధానం.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో కనిష్టంగా ఒక సంవత్సరం, గరిష్టంగా ఐదు సంవత్సరాల కాలానికి అందుబాటులో ఉంటుంది. పెట్టుబడిని రూ. 200 నుంచి ఎంతైనా పెట్టవచ్చు. ఎందుకంటే పెట్టుబడి పెట్టగల మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. పథకంపై వడ్డీ రేటును భారత ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తుంది. ఈ వడ్డీ రేటు సాధారణంగా బ్యాంకులు అందించే రేటు కంటే ఎక్కువగా ఉంటుంది.
పెట్టుబడిదారులు ఏదైనా పోస్ట్ ఆఫీస్ వద్ద లేదా ఇండియా పోస్ట్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై సంపాదించిన వడ్డీని నెలవారీ, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా మెచ్యూరిటీ సమయంలో స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే.. ఈ ఖాతాకు భారత ప్రభుత్వం పూర్తి సంరక్షణ ఇస్తుంది. అంటే పెట్టుబడి పూర్తిగా సురక్షితమైనది. అసలు మొత్తం, అలాగే దాపిపై సంపాదించిన వడ్డీని తిరిగి చెల్లించడానికి ప్రభుత్వమే హామీగా ఉంటుంది. పైగా వడ్డీలో కొంత పరిమితి వరకు పన్ను రాయితీ ఉంటుంది. అలాగే ఈ ఖాతా నిర్వహణ చాలా సులభం. పెట్టుబడిదారులు తమ ఇంటి నుంచి ఒక ఖాతాను తెరవడానికి లేదా ఆన్‌లైన్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. ఈ పథకం బ్యాంక్ ఖాతా లేని వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. చివరిగా , తమ డబ్బును నిర్ణీత కాలానికి పెట్టుబడి పెడుతూ.. బ్యాంకుల కన్నా అధిక వడ్డీ పొందాలనుకునే వ్యక్తులకు ఇది సరైన ఎంపిక.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..