బంగారాన్ని, భారతీయులను విడదీసి చూడలేం. అంతలా భారతీయుల జీవితాల్లో బంగారం ఓ భాగమైపోయింది. ఏ చిన్న శుభకార్యం జరిగినా వెంటనే బంగారం కొనుగోలు చేయాల్సిందే. అలాంటిది పెళ్లిళ్లు జరిగితే బంగారం కొనుగోలు చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారాన్ని భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారు.
అయితే బంగారం కొనుగోలు చేసే విషయంలో కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని మీకు తెలుసా.? నగదు రూపంలో ఒక వ్యక్తి ఎంత బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అసలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో నిపుణుల మాటల్లోనే. ప్రముఖ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు బల్వంత్ జైన్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి నగదు రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఎలాంటి పరిమితి లేదు. అయితే పన్ను సంబంధిత నిబంధనల ప్రకారం మాత్రం.. బంగారం విక్రయించే వారు మాత్రం రూ. 2 లక్షల వరకు మాత్రమే నగదును స్వీకరించగలరని తెలిపారు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అమ్మకాల్లో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు స్వీకరించడానికి వీలు ఉండదు. ఒకవేళ బంగారం వ్యాపారులు రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదును పన్ను చెల్లించకుండా స్వీకరిస్తే ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిమానాను విధించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ ఒక కస్టమర్.. రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని నగదు లేదా ఇతర మార్గాల ద్వారా కొనుగోలు చేస్తే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 2 లక్షల లోపు అయితే ఆధార్ కానీ, పాన్ కానీ చూపించాల్సి అవసరం ఉండదు.
ఇదిలా ఉంటే దీర్ఘకాలంగా బంగారం పెట్టుబడి పెట్టాలనుకునే వారు సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా మెరుగైన రాబడిని పొందొచ్చు. ప్రపంచంలో అత్యంత విలువైన లోహలలో బంగారం ఒకటి కాబట్టే దీనికి అంత డిమాండ్. సుమారు 5వేల ఏళ్ల క్రితమే బంగారం ఉనికిలోకి వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..