
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతీరోజు బంగారం ధరలు ఎంతోకోంత పెరుగుతూ షాక్ ఇస్తూనే ఉన్నాయి. వెండి ధర అయితే ఒకేసారి వేలల్లో పెరుగుతోంది. తులం బంగారం రూ.లక్షా 30 వేలకు చేరుకోగా.. కేజీ వెండి ధర రూ.2 లక్షలకు చేరుకుంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగనున్నాయని, వచ్చే ఏడాది రూ.లక్షన్నరకు మించి దాటిపోయే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరల పెరుగుదలను చూస్తే ఆ అంచనాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయో ఇప్పుడు చూద్దాం.
డిసెంబర్ 14న 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ.1,33,910గా ఉంది. అది మెల్లగా మధ్యలో పెరుగుతూ, తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్ద స్థిరపడింది. అంటే ఈ వారంలో రూ.270 మేర పెరిగినట్లు అయింది. ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. డిసెంబర్ 14వ తేదీన రూ.1,22,750 వద్ద ఉండగా.. డిసెంబర్ 21 నాటికి రూ.1,23,000 వద్ద స్థిరపడింది. అంటే రూ.205 మేర వారంలో పెరిగింది.
భారత్ బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. ఇటీవల ఏకంగా రూ.91కి చేరుకుని చరిత్రలో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఇక యూఎస్ డాలర్ బలపడటం, అంతర్జాతీయ వడ్డీ రేట్లుపై అనిశ్చిత నెలకొనడం కూడా పెరుగుదలకు కారణం. ఇక ఈ నెల, వచ్చే నెలలో వరుస పండుగలు రానున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉండటంతో డిమాండ్ పెరగనుంది. దీని వల్ల బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.