
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భౌతిక బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో డిజిటల్, ఫైనాన్షియల్ గోల్డ్ పెట్టుబడులపై మళ్లీ చర్చ మొదలైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం కొనుగోళ్లు పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. అయితే ఆభరణాలు, నాణేలు, బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేయకుండా గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్‌లు), మల్టీ అసెట్ ఫండ్ల వంటి మార్గాలను ఎంచుకుంటే దేశానికి దిగుమతి భారం తగ్గడంతో పాటు పెట్టుబడిదారులకు కూడా ప్రయోజనం ఉంటుంది.
భారతీయ కుటుంబాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా 10-15 శాతం మించకూడదని సూచిస్తున్నారు. మార్కెట్ ఒడిదొడుకుల సమయంలో రక్షణ కవచంలా ఉపయోగపడటమే దీని ప్రధాన ప్రయోజనం అని చెబుతున్నారు. డిజిటల్ బంగారం పెట్టుబడుల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు ప్రముఖ ఎంపికగా నిలుస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరిగానే డీమ్యాట్ ఖాతా ద్వారా వీటిని కొనుగోలు, విక్రయాలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే తయారీ చార్జీలు, లాకర్ ఖర్చులు, స్వచ్ఛత భయాలు ఉండవు. అత్యవసర సమయంలో సులభంగా నగదుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇక సెబీ నిబంధనల ప్రకారం ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్‌లు) మరో కొత్త ప్రత్యామ్నాయం. ఇందులో వాల్ట్‌లలో నిల్వ ఉంచిన నిజమైన బంగారానికి అనుగుణంగా డిజిటల్ రసీదులు జారీ చేస్తారు. అవసరమైతే భవిష్యత్తులో వాటిని నిజమైన బంగారంగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ రూపంలో ఉన్నంతకాలం జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత. అదే సమయంలో ఈక్విటీ, డెట్, బంగారం వంటి పలు ఆస్తుల్లో సమతుల్యంగా పెట్టుబడులు పెట్టే మల్టీ అసెట్ ఫండ్లు కూడా మంచి ఎంపికగా మారుతున్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు పెట్టుబడుల కేటాయింపును మారుస్తూ రిస్కును తగ్గించేందుకు ప్రయత్నిస్తారు.
వైట్ ఓక్ క్యాపిటల్ చేసిన అధ్యయనం ప్రకారం.. డెట్‌తో పాటు ఈక్విటీ, బంగారం కలిపిన మల్టీ అసెట్ పోర్ట్‌ఫోలియోలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను అందించాయి. ముఖ్యంగా 55 శాతం డెట్, 25 శాతం ఈక్విటీ, 20 శాతం బంగారం కలిగిన పోర్ట్‌ఫోలియో సగటున 11.61 శాతం వార్షిక రాబడిని ఇచ్చినట్లు అధ్యయనం వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి